- లాకర్లోని వజ్రాభరణాలు మాయం చేసిన పనిమనిషి
- ఈ మధ్య చేరిన నేపాల్ వ్యక్తి పనే..
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి వాచ్‌మన్ దంపతులు, పనిమనుషులకు ఇచ్చి ఇంట్లో వజ్రాభరణాలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. రవీంద్ర శర్మ అనే వ్యాపారి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–69లోని నందగిరి హిల్స్, ప్లాట్ నంబర్–62లో భార్య, కొడుకు శుభం, కోడలు నేహా, మూడు నెలల మనవరాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో నలుగురు పనివాళ్లు ఉన్నారు. వంటమనిషి రాకేశ్ ఐదేళ్లుగా పనిచేస్తుండగా, నాగేశ్వరరావు, ఆయన భార్య నీరజ మూడేళ్లుగా వాచ్‌మన్లుగా ఉన్నారు. ఇటీవల భూపేంద్ర షాహీ(భువన్–20) అనే నేపాలి యువకుడు జూనియర్ వంటమనిషిగా చేరాడు.
ఈ భవనం జీ ప్లస్ 4 అంతస్తులతో ఉండగా, సెల్లార్‌లో పనివాళ్లు నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు రవీంద్ర శర్మ కుటుంబంతో కలిసి బంజారాహిల్స్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. కుమారుడు శుభం టెన్నిస్ ప్రాక్టీస్ కోసం స్టేడియానికి వెళ్లాడు. రాత్రి 8:40 గంటలకు పాప ఏడుస్తుండటంతో నేహా కేర్‌టేకర్ మాయారాణితో కలిసి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో వంట చేయమని రాకేశ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు.
రాత్రి 9:24 గంటలకు ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండటం, పనివాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేహా.. రవీంద్ర శర్మకు సమాచారం ఇచ్చింది. వెంటనే రవీంద్ర శర్మ దంపతులు ఇంటికి చేరుకున్నారు. మూడో అంతస్తుకు మాయారాణిని పంపగా, ఓ గుర్తుతెలియని ఆమెను తోసివేసి పారిపోయాడు. అతడితో పాటు మరో ఇద్దరు పారిపోయారు. అందులో ఇటీవల చేరిన భూపేంద్ర షాహీ కూడా ఉన్నాడు. ఒకరి వద్ద బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. సెకండ్ ఫ్లోర్‌లో వాచ్‌మన్ నాగేశ్వరరావు చేతులను వెనుకకు కట్టి పడేసి ఉండగా, భార్య నీరజ అపస్మారక స్థితిలో కనిపించింది.
మూడో అంతస్తులోని బెడ్‌రూంలో నగల బాక్స్‌ను పగలగొట్టి అందులోని వజ్రాభరణాలను దొంగిలించినట్లు గుర్తించారు. అక్కడ స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్డు లభ్యమయ్యాయి. భూపేంద్ర షాహీ ఇతరులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. దొంగిలించిన నగల విలువ ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
