మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు

మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు
  • సిండికేట్​గా ఏర్పడి దందా.. గ్రేడ్, నాణ్యత పేరుతో దోపిడీ
  • సీజన్ ప్రారంభంలో టన్ను రూ.60 నుంచి 80 వేలు పలికిన మామిడి
  • మార్కెట్​లో డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాల్లో రైతులు
  • దళారుల చేతుల్లో జగిత్యాల మ్యాంగో మార్కెట్.. సూర్యాపేట మామిడి రైతులదీ అదే పరిస్థితి

జగిత్యాల/సూర్యాపేట, వెలుగు : మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కమీషన్ ఏజెంట్లంతా సిండికేట్​గా మారి మద్దతు ధర ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్​లో మామిడి కాయలకు డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత, గ్రేడ్ సాకుగా చూపి చాలా తక్కువ ధరకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో టన్ను రూ.60 వేల నుంచి రూ.80 వేలు పలకగా.. ఇప్పుడు రూ.10 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నరు. 

రాష్ట్రంలో జగిత్యాల, సూర్యాపేట జిల్లాల్లో పండించే మామిడి పంటకు మంచి పేరుంది. ఇక్కడి నుంచి వివిధ రకాల మామిడిపండ్లు నాగ్​పూర్, ముంబై, ఢిల్లీకి ఎగుమతి అవుతుంటాయి. ఆయా మార్కెట్ల నుంచి స్పెషల్​గా ప్యాక్ చేసి విదేశాలకు కూడా ఎక్స్​పోర్టు చేస్తుంటారు. ఇక్కడి మామిడి పండ్లకు ఇంత క్రేజ్ ఉన్నా.. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దొరకడం లేదు. వాస్తవానికి కాయను బట్టి ఓపెన్ మార్కెట్ లో వేలం వేస్తే మంచి లాభాలు వస్తాయి. కానీ.. సిండికేట్ గా మారిన కమీషన్ ఏజెంట్లు.. మార్కెట్ కు తరలించిన కాయలను ఏదో ఒక కారణం చెప్పి చాలా తక్కువ ధరకు కొంటున్నరు.

ఇలా రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడి కాయలను బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నరు. ఇప్పటికే తేనె మంచు, నల్ల తామర ప్రభావం కారణంగా మామిడి దిగుబడి చాలా పడిపోయింది. చేతికొచ్చిన పంటైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితుల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా కూడా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు దళారులు సిండికేట్​గా మారి మద్దతు ధర దక్కకుండా చేస్తున్నరని రైతులు అంటున్నారు.

టన్నుకు పదివేలు కూడా ఇస్తలేరు

మామిడికాయలు అమ్ముకుందామని మార్కెట్​కు తీసుకెళ్లిన. వేలం పాట నిర్వహించారు. పాటలో ఒక టన్నుకు రూ.25వేలు పాడారు. అన్ లోడింగ్ చేసే టైమ్​లో కాయల సైజు సరిగా లేదని ఒక టన్నుకు రూ.10వేలు ఇస్తే ఇవ్వు లేకుంటే లేదని వ్యాపారి తేల్చి చెప్పాడు. దీంతో వరంగల్ తీసుకెళ్లాను. అక్కడ టన్ను రూ.40 వేలు పలికింది. - ప్రశాంత్​, మామిడి రైతు, అర్వపల్లి

లీజుకు తీసుకుని ఎక్స్​పోర్ట్

జగిత్యాల జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతుంది. ఇక్కడి బంగినపల్లి రకానికి మంచి పేరుంది. జగిత్యాల మామిడిగా పిలిచే ఈ వెరైటీకి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. కానీ.. కమీషన్ ఏజెంట్లు మాత్రం మామిడి రైతులను దోచుకుంటున్నరు. రెండు, మూడేండ్ల నుంచి మామిడికి ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాకపోవడంతో రైతులతో పాటు కౌలుదారులు పంట సాగు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు, కమీషన్ ఏజెంట్లు నేరుగా రైతుల నుంచి తక్కువ ధరకు మామిడి చెట్లను లీజుకు తీసుకుంటున్నరు.

ఆ తర్వాత నేరుగా నాగ్​పూర్, ఢిల్లీ మార్కెట్​కు తరలిస్తున్నారు. మరికొందరు రైతులు మామిడి చెట్లను నరికేస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నరు. ఓపెన్ మార్కెట్లు ఏర్పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ధర పలుకుతుందనుకుంటే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బహిరంగ మార్కెట్ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు.

సూర్యాపేటలో మార్కెటింగ్​ ఇబ్బందులు

సూర్యాపేట జిల్లాలో 14వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి రైతులు కూడా దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నరు. మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏండ్ల నుంచి ఉంది. కానీ.. ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదని రైతులు అంటున్నరు. దీంతో జిల్లా కేంద్రంలోని కొంత మంది దళారులు సిండికేట్​గా ఏర్పడి రైతుల వద్ద అగ్గువకు కొని ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఎకరానికి సగటున ఐదు నుంచి 8 టన్నుల లెక్కన..

ఏటా రూ.100 కోట్లపైనే వ్యాపారం సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. అడ్తీ దుకాణానికి సరుకు తీసుకెళ్తే మంచి ధరకు అమ్మి పెడ్తామని నమ్మబలుకుతూ రైతులకు అడ్వాన్సులు అంటగ డ్తున్నారు. అడ్వాన్స్ తీసుకోవడంతో మరో చోటకు వెళ్లే చాన్స్ ఉండదు. దీంతో అక్కడి వ్యాపారి పట్టీపై రాసిచ్చిందే ఫైనల్ రేటు. ముందు చెప్పిన ధరకు.. మార్కెట్​లో చెల్లించే ధరకు చాలా తేడా ఉంటున్నదని రైతులు అంటున్నరు.

వారం రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు మామిడి కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాలిన కాయలకు కేవలం కేజీ రూ.5 నుంచి రూ.6 మాత్రమే ఇస్తున్నరు. ఎకరానికి 3 టన్నులకు పైగా పంట రావాల్సి ఉండగా.. అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి 1.5 నుంచి 2 టన్నులకు పడిపోయింది.