
సిద్దిపేట: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. బీద ప్రజలు బాధపడొద్దనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం (అక్టోబర్ 22) 204 మంది లబ్ధిదారులకు గజ్వేల్లోని సమీకృత కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు మంత్రి వివేక్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో 26 వేల రేషన్ కార్డులు పంపిణీ చేసిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు. వచ్చే డిసెంబర్లో 3500 ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు.
12 వేల కోట్లు ఖర్చు చేసి పేద ప్రజలకు ఉచితంగా రేషన్ ద్వారా సన్నం బియ్యం ఇస్తున్నామని చెప్పారు. వైద్యం విషయంలో ఎన్నో అప్లికేషన్లపై సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సంతకాలు చేశామన్నారు. అన్ని రంగాల్లో బీద ప్రజలు ముందుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.