
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల క్రితమే చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా కొనసాగించడంపై ఆర్టీఏపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు
ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఆదేశించారు. సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని.. చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండొద్దన్నారు.
చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని వెల్లడించారు. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని తెలిపారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని చెప్పారు. చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదిక అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని చెప్పారు రవాణాశాఖ కమిషనర్.