
తిరువనంతపురం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 4 రోజుల టూర్లో భాగంగా 2025, అక్టోబర్ 22వ తేదీన కేరళ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తద్వారా శబరిమలలో ప్రార్థనలు చేసిన తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు.
ఓవరాల్గా శబరిమలను దర్శించుకున్న రెండో రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ముర్ము కంటే ముందు1973లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి, ఆయన కుమారుడితో పాటు మరికొందరు ఎంపీలతో కలిసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. తిరిగి 52 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము శబరిమలను దర్శించుకున్నారు.
ఇదిలా ఉంటే.. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అంటే కొన్ని ప్రత్యేక విధివిధానాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఆలయ నియమాలకు తగ్గట్టుగానే రాష్ట్రపతి ముర్ము సంప్రదాయాలను పాటించారు. నల్లటి దుస్తులు ధరించి ఇరుముడి కట్టారు. తలపై ఇరుముడితో.. 18 బంగారు మెట్లు ఎక్కారు రాష్ట్రపతి.
ఆ తర్వాత కొండపై అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సంప్రదాయ బద్దంగానే ఆమె పర్యటన, దర్శనం సాగింది. ఎక్కడ ఆలయ నిబంధనలు ఉల్లంఘించలేదు. రాష్ట్రపతి వెంట ఉన్న సెక్యూరిటీ, భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితోనే బంగారు మెట్లు ఎక్కి స్వామిని దర్శనం చేసుకున్నారు.
మధ్యాహ్నం పూజలు ముగిసే ముందు రాష్ట్రపతి సన్నిధానంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి పతనంతిట్ట వరకు రోడ్డు మార్గంలో వచ్చారు రాష్ట్రపతి. అక్కడి నుంచి కొండ ఆలయం బేస్ స్టేషన్ అయిన పంపాకు చేరుకున్నారు.