
బెంగుళూర్: ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగుళూరులో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. సిటీలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణ ఘటన మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఓ మహిళ బెంగళూరులోని మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం బలవంతంగా ఆమెను వేరే గదిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఆ మహిళ నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.25 వేల నగదును కూడా దొంగిలించారు.
మద్యం మత్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడగా.. అందులో ముగ్గురు మహిళపై లైంగిక దాడి చేశారు. ఈ దారుణం మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి 9.30 నుంచి 12.15 గంటల మధ్యలో జరిగింది. నిందితుల నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
►ALSO READ | గజియాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. రెసిడెన్షియల్ బిల్డింగ్ లో మంటలు
బెంగళూరు రూరల్ ఎస్పీ సీకీ బాబా ఈ ఘటనపై స్పందించారు. మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి నిందితులు మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఆమె వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. 25 వేల నగదు దొంగలించి పారిపోయారని చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని.. నేరంలో భాగమైన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్నవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు.