లక్నో: ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంధనం లీక్ అయ్యింది. వెంటనే గుర్తించిన పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్ల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఇండిగో ఎయిర్ లైన్స్, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, బుధవారం (అక్టోబర్ 22) సాయంత్రం 166 మంది ప్రయాణికులతో ఇండిగో 6E6961 విమానం కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత విమానంలో ఆయిల్ లీక్ సమస్య తలెత్తింది. సమస్యను వెంటనే గుర్తించిన పైలట్ విషయాన్ని వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు తెలియజేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాసేపు గందరగోళానికి గురైన ప్రయాణికులు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో 6E6961 విమానాన్ని ఇంధన సమస్య కారణంగా వారణాసిలో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారని పేర్కొంది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 166 మంది ఉన్నారని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. టెక్నికల్ టీమ్ విమానాన్ని తనిఖీ చేపట్టిందని.. ఇంధన లీక్‌కు గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పింది.
