ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు.. ఏపీలోని 14 జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ

ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు.. ఏపీలోని 14 జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతోందని భాతర వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 

వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‎కు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. 

మొత్తం 14  జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. 

►ALSO READ | తిరుపతిలో వర్ష బీభత్సం... ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతాలు.. ఇళ్లలోకి వరద నీరు..

భారీ వర్షాలతో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌లో 0861 2331261, 79955 76699 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో  హోం మంత్రి అనిత APSDMA అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను 24/7 అప్రమత్తంగా ఉంచాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.