ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం కాక రేపుతోంది. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టే వరకు టీటీడీ ఇన్చార్జ్ ఈవోగా వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ నెయ్యి వివాదం కారణంగానే అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన తిరుమల లడ్డూ నెయ్యి కేసులో ఇటీవల సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు అవశేషాలు ఉపయోగించలేదని నివేదికలో సిట్ పేర్కొంది. సిట్ నివేదిక తర్వాత నెయ్యి ఇష్యూపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
