
‘తెలంగాణ రైజింగ్ విజన్- 2047’ పేరుతో రాష్ట్ర అభివృద్ధికి డాక్యుమెంటును రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ డాక్యుమెంట్ తయారీలో పౌరులందరూ భాగస్వాములయ్యేలా సిటిజన్ సర్వే చేపట్టారు. 2047 నాటికి తెలంగాణ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో పౌరులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ అంశాలపై తమ ఆలోచనలను, సూచనలను సర్వేలో పొందుపరచాలి.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధి 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిర్వహించాల్సిన కోర్సులు అనేక రంగాల అభివృద్ధి ప్రణాళికలు, ఫార్మా , బయోసైన్స్ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలపై పౌరులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపాలని కోరుతోంది. ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ అంటున్నది. ప్రస్తుత కమ్యూనికేషన్ ప్రపంచంలో ఉపాధి, ఉద్యోగరంగాల విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్న మాట వాస్తవం. ఎనిమిది రకాల ప్రశ్నలిచ్చి, అప్షన్లు ప్రభుత్వమే ఇచ్చి సూచనలివ్వాలని కోరుతున్నది. అది కూడా ఆన్‌లైన్ ద్వారా. వినేందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఆచరణ ఏమిటనేదే అసలు ప్రశ్న?
అభివృద్ధిపై విస్తృత చర్చ
మెజార్టీ గ్రామీణ ప్రజల వృత్తికి ఆధారమైన వ్యవసాయ రంగంపై ప్రభుత్వ విధానం తయారు కాలేదు. ఏదో ఒక ప్రాజెక్టు నిర్మిస్తాం, చెరువులు తవ్విస్తామనే ప్రకటనలతోనే కాలం గడుస్తోంది. రైతులకు కావలసిన ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచడంతోపాటు, వారు పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ సమీకృత ఆహారం అందేలా వివిధ రకాల ఆహార ధాన్యాలు, మెట్ట పంటలు, నీటి వసతి, వర్షాల తీరు ననుసరించి వ్యవసాయశాఖ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలి.
ఈ అంశాలపై ప్రజాభిప్రాయం తీసుకొని రైజింగ్ తెలంగాణ ప్రణాళిక ప్రశ్నావళిలో చేర్చాలి. అప్పుడే ప్రజలు వారి జీవితంతో సంబంధం ఉండే అంశాలపై అభిప్రాయాలు తెలుపుతారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన విద్య, వైద్యం గురించి శాశ్వత
ప్రణాళికలు, ప్రభుత్వ విద్య గురించి శాశ్వతమైన ఆచరణీయమైన ప్రణాళిక ఇంకా రూపొందించలేదు.
అందుకోసం మంత్రివర్గ కమిటీ, విద్యా కమిషన్, తెలంగాణ విద్యా ప్రణాళిక వంటివి ఉనికిలోకి తెచ్చారు. ఈ కమిటీలు వాటి పరిశీలనలతో కూడిన నివేదికలు అందజేయకుండానే ప్రభుత్వం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. శంకుస్థాపనలు చేస్తోంది. అధికారం చేపట్టగానే నైపుణ్యాల పెంపుకోసం ప్రైవేట్ సంస్థ యజమాని వైస్ ఛాన్సలర్‌గా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. రాష్ట్ర
బడ్జెట్లో తగిన నిధుల కేటాయింపు లేదు.
ప్రతి జిల్లా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి
33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అయితే ప్రారంభమయ్యాయి. నిధుల కేటాయింపులు లేవు. మౌలిక వసతులు, శిక్షణా ప్రమాణాల్లో లోపాలు ఉన్నాయని, నిపుణులైన ప్రొఫెసర్లు పూర్తిస్థాయిలో లేరని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడిక ల్ అసోసియేషన్ తెలిపింది. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం 2020పై ప్రజల అభిప్రాయం అడగడం లేదు. ప్రభుత్వమైతే ఏ చర్చ లేకుండా జాతీయ విద్యా విధానం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, ఆ విశ్వవిద్యాలయం ఆ జిల్లాలో లభ్యమయ్యే వనరుల ప్రాతిపదికన పరిశోధనలు జరిపి, ఆ పరిశోధన ఫలితాలను ఆ జిల్లా అభివృద్ధికి ఉపయోగించే ప్రణాళిక రూపొందించాలి. ప్రతి జిల్లా అక్కడి వనరులను ఉపయోగించుకొని స్వయం సమృద్ధిగా రూపొందించే విధానం కావాలి. కార్పొరేట్ సంస్థలకు చౌకగా నిపుణులను అందించే కర్మాగారాలుగా ఉన్నత విద్య, వృత్తి విద్యాసంస్థలు నెలకొల్పడం కన్నా, మన రాష్ట్రానికి, దేశావసరాలు తీర్చే నిపుణులను రూపొందించే
ప్రణాళికలు కావాలి.
‘తెలంగాణ రైజింగ్ విజన్- 2047’ పేరుతో రాష్ట్ర అభివృద్ధికి డాక్యుమెంటును రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ డాక్యుమెంట్ తయారీలో పౌరులందరూ భాగస్వాములయ్యేలా సిటిజన్ సర్వే చేపట్టారు. 2047 నాటికి తెలంగాణ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో పౌరులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ అంశాలపై తమ ఆలోచనలను, సూచనలను సర్వేలో పొందుపరచాలి.
- కె. వేణుగోపాల్,
ఎడ్యుకేషన్ ఎనలిస్ట్