IPL 2026: CSK మాస్టర్ ప్లాన్: గుజరాత్ నుంచి టాప్ ప్లేయర్‌ను లాగేసుకున్న చెన్నై

IPL 2026: CSK మాస్టర్ ప్లాన్: గుజరాత్ నుంచి టాప్ ప్లేయర్‌ను లాగేసుకున్న చెన్నై

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సూపర్ కింగ్స్ జట్టులో లోకల్ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకోనున్నట్టు సమాచారం. తమిళ వార్తల వెబ్‌సైట్ ప్రకారం.. ఐపీఎల్ 2026కి ముందు వాషింగ్టన్ సుందర్‌ను CSKకి రూ. 3.2 కోట్లకు  విక్రయించడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు తెలిసింది. రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  సుందర్ తమకు మంచి రీప్లేస్ మెంట్ అని చెన్నై యాజమాన్యం భావిస్తోందట.   

టైటాన్స్ తమ ఆల్ రౌండర్‌ సుందర్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవడం కారణంగానే వారు ఈ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కమర్షియల్ డీల్ లో CSK ఎటువంటి షరతులు విధించలేదని సమాచారం. 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుందర్.. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. ఈ ఆల్ రౌండర్ కు కేవలం 6 మ్యాచ్ ల్లోనే మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆరు మ్యాచ్ ల్లోనూ సుందర్ 133 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై:  

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ బౌలర్ గా నిలిచిన అశ్విన్ మొత్తం ఐదు జట్ల తరపున 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ రోజు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. 38 ఏళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 

లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సీఎస్కె యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడి 9.13 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించింది లేదు. ఐపీఎల్ 2026 సీజన్ లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమనే హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి. ఈ విషయం ముందుగానే గ్రహించిన అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  

త్వరలో రిటైన్ ప్లేయర్లపై సమావేశం:
 
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురూ చర్చించనుండగా.. తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 14 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని ఐపీఎల్ సమయంలోనే ధోనీ చెప్పాడు.