- సెన్సెక్స్ 943 పాయింట్లు అప్
- క్రూడాయిల్ ధరలు పడడం, వాల్యూ బయ్యింగే కారణం
ముంబై: బడ్జెట్ రోజు భారీగా పడిన మార్కెట్, సోమవారం పుంజుకుంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 943 పాయింట్లు (1.17 శాతం) ఎగిసి 81,666.46 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 1,009 పాయింట్లు పెరిగి 81,732.25ని తాకింది. నిఫ్టీ 262.95 పాయింట్లు పెరిగి 25,088.40 వద్ద సెటిలయ్యింది. డెరివేటివ్స్‌పై ఎస్‌టీటీ పెంచడంతో సెన్సెక్స్ ఆదివారం 1,546 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. ఈ సెషన్‌లో రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు. క్వాలిటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు 4.88శాతం తగ్గి బ్యారెల్‌కు 65.94 డాలర్లకి చేరడంతో సోమవారం మార్కెట్ తిరిగి లేచింది. ఇన్వెస్టర్ల సంపద రూ.5.5 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ 7.61శాతం, అదానీ పోర్ట్స్ 4.76శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు లాభపడ్డాయి. అయితే యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ట్రెంట్, టైటాన్ నష్టపోయాయి.
పుంజుకున్న తయారీ రంగం
కిందటి నెలలో తయారీ రంగం పీఎంఐ 55.4కి పెరిగి స్వల్పంగా పుంజుకొంది. డిసెంబర్ 2025 లో రెండేళ్ల కనిష్టమైన 55 కి పీఎంఐ తగ్గిన విషయం తెలిసిందే. బిజినెస్ కాన్ఫిడెన్స్ మూడు-న్నరేళ్ల కనిష్టానికి పడిపోయినా, కొత్త ఆర్డర్లు పెరిగాయి. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించిన రూ.53.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో తయారీ, డేటా సెంటర్లు, వ్యవసాయం, టూరిజం రంగాలకు మద్దతు ఇచ్చారు. ఎస్‌టీటీ పెంపు, ప్రభుత్వం అప్పుల టార్గెట్‌ను పెంచడం వంటివి బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణపై కేంద్రం ఫోకస్ పెట్టిందనే విషయం అర్థమవుతోందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. మీడియం లాంగ్ టర్మ్‌లో కంపెనీల లాభాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయన్నారు. ఆసియా మార్కెట్లలో సౌత్ కొరియా కొస్పి సోమవారం 5శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ, షాంఘై ఎస్‌ఎస్‌ఈ, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ కూడా నష్టపోయాయి. యూరప్ మిశ్రమంగా, అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో కదిలాయి.
జనవరిలో రూ.36 వేల కోట్లు బయటకు..
ఈ ఏడాది జనవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.36 వేల కోట్ల (3.97 బిలియన్ డాలర్ల) విలువైన షేర్లను అమ్మారు. ఎస్‌టీటీ పెంపుతో సమీప కాలంలో మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ తగ్గే అవకాశం ఉంది. 2025లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1.66 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. డాలర్ బలపడటం, బాండ్ యీల్డ్స్ పెరగడం, రూపాయి బలహీనత, గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ వీరి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
రూపాయి@ 91.51
బడ్జెట్ తర్వాత రోజు రూపాయి పుంజుకుంది. డాలర్‌తో 42 పైసలు బలపడి 91.51 వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆర్‌బీఐ 92 స్థాయిని కాపాడే ప్రయత్నం రూపాయికి బలాన్ని ఇచ్చాయి. ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో రూపాయి డాలర్‌తో సోమవారం 91.95 వద్ద ప్రారంభమై 91.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. శుక్రవారం 92.02 రికార్డు కనిష్టాన్ని తాకిన రూపాయి ఇప్పుడు కొంత పుంజుకుంది.
