- మున్సిపోల్స్‌లో రెబల్స్‌తో విత్‌డ్రా చేయించేందుకు నేతల విశ్వప్రయత్నాలు
- బీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లోనే ఎక్కువ మంది రెబల్స్
- అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు,
- ఎమ్మెల్యేలు, సీనియర్లుపలుచోట్ల దారికివస్తున్నా.. మరికొన్నిచోట్ల బెట్టు
- అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగులు
- టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావహుల ఆత్మహత్యాయత్నం
- పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన
- నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్‌డ్రాకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు నేతలు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకే అవకాశముండడంతో మూడు ప్రధాన పార్టీల్లోని ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి, అసంతృప్తులను నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సోమవారం జిల్లా కేంద్రాల్లోనే అడ్డా వేసి అసంతృప్తులతో మంతనాలు కొనసాగించారు. ఓవైపు నేతలు రెబల్స్‌ను బుజ్జగించే పనిలో ఉండగా, మరోవైపు ఆశావహులు టికెట్లు దక్కించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్లాక్‌మెయిలింగ్ కుదిగుతుండగా, ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.
టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో కాంగ్రెస్కార్యకర్తలు ఒంటిపై డీజిల్, పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేయడంతో ఆయా చోట్ల కలకలం రేగింది.
రెబల్స్‌తో విత్‌డ్రా చేయించేందుకు విశ్వప్రయత్నాలుఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్ బెడద వల్ల ప్రధాన పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. అందువల్ల ఈసారి ప్రతి వార్డులో కాంగ్రెస్ తరఫు నుంచి ఒక్కరే బరిలో ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ రెబల్స్ బెడద లేకుండా చూడాలని ఇప్పటికే మంత్రులు, పార్టీ ముఖ్యులను ఆయన ఆదేశించారు. మరోవైపు పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు మున్సిపోల్స్నుప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 10,046 , బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్స్ పడ్డాయి. ఒక్కో స్థానానికి సగటున నాలుగు నుంచి పది మంది వరకు పోటీ పడ్తుండడంతో రెబల్స్‌తో నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు నేతలు రెండు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని, నామినేటెడ్‌పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. చాలాచోట్ల అసంతృప్తులు మెత్తబడుతున్నా, కొన్నిచోట్ల మొండికేస్తున్నారు.
జగిత్యాలలో టెన్షన్.. టెన్షన్..
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదలేదు. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ప్రాధాన్యం దక్కుతోందన్న ఊహాగానాలతో పార్టీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాలలో 16వ వార్డు నుంచి టికెట్ఆశిస్తున్న బొల్లి శేఖర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ వార్డు నుంచి ఎమ్మెల్యే సంజయ్వర్గానికి టికెట్ వస్తున్నదనే సమాచారంతో జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన చిన బొల్లి శేఖర్ జీవన్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి ఆవరణలోనే ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. “20 ఏండ్లుగా పార్టీ జెండా మోస్తున్న.. మాకు మాత్రం న్యాయం జరగడంలేదు” అంటూ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ కార్యాలయం, నివాసం, ఆస్పత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాలలోని 50 వార్డుల్లో సంజయ్–జీవన్ వర్గాల అనుచరులు పోటీలో ఉండటంతో టికెట్లు ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో టెన్షన్ పెరిగిపోతోంది.
సూర్యాపేటలోనూ ఉద్రిక్తత..
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ల కేటాయింపు చిచ్చు రేపుతోంది. 2రోజుల క్రితం 11వ వార్డులో మొదలైన నిరసన మరవకముందే, సోమవారం 25వ వార్డు టికెట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 25వ వార్డు టికెట్‌ను ఇతరులకు కేటాయిస్తున్నారని తెలుసుకున్న కోడి శివ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడి శివను అడ్డుకుని పెట్రోల్ బాటిల్‌ను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. వరుసగా వార్డులవారీగా నిరసన తెలుపుతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పారాచూట్ నేతలకు, అనర్హులకు టికెట్లు ఇస్తే ఊరుకోబోమని, హైకమాండ్వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి న్యాయం చేయాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఏ జిల్లాలో చూసినా ఇదే సీన్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు ఇద్దరు ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో తన ప్రమేయం లేకుండా అభ్యర్థులను ఎంపికచేశారనే కోపంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన భార్య, ఇద్దరు కొడుకులతో నామినేషన్లు వేయించారు. తనకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ తిరువనూరు భార్గవ్ అనుచరులను పోటీ నుంచి తప్పిస్తే నే తన కుటుంబ సభ్యుల నామినేషన్లు విత్ డ్రా చేయిస్తానని ఎమ్మెల్యే బత్తుల తేల్చి చెప్పడంతో భార్గవ్ అనుచరులను విత్ డ్రా చేసుకోవాలని ఎంపీ రఘువీర్ రెడ్డి సోమవారం ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ రెబెల్స్‌తో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఎంత నచ్చజెప్పినా వినని కొందరు రెబల్స్‌కు మంత్రులు స్ట్రాంగ్‌వార్నింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం ఆశిస్తున్న కొందరు అభ్యర్థులు వారి డివిజన్లలో రెబల్స్ బెడద లేకుండా చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో కేటీఆర్ చెప్పినా వినకుండా బీఆర్ఎస్ నుంచి ప్రతీ వార్డులో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరితో విత్‌డ్రా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇక కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఇప్పటి వరకు అక్కడి లీడర్లతో మాట్లాడకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి, మంత్రులు దామోదర రాజ నర్సింహ, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.
