
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం నిల్వలు కొత్త రికార్డును సృష్టించాయి. సెప్టెంబర్ చివరి వారం 0.2 మెట్రిక్ టన్నుల బంగారం జోడించడం ద్వారా ఆర్బీఐ దగ్గర మొత్తం బంగారం నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు చేరాయి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం..సెప్టెంబర్26 నాటికి రిజర్వు బ్యాంకులో బంగారం నిల్వల విలువ 95బిలియన్ డాలర్లకు చేరింది. ఆర్బీఐ గత ఆరునెలల్లో 0.6(600కిలోగ్రాములు) మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. మార్చి నుంచి జూన్ వరకు0.2 మెట్రిక్ టన్నులు, జూలైనుంచి సెప్టెంబర్ వరకు 0.4 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఆర్బీఐ.
2024-25 చివరి నాటికి అనగా మార్చి చివరి నాటికి 879.58 మెట్రిక్ టన్నులుగా ఉన్న RBI బంగారు నిల్వలు.. సెప్టెంబర్ చివరి నాటికి 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి.2024–25 లో 54.13 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
ఆర్బీఐ రిపోర్టు ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారంపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. సురక్షిత పెట్టుబడిగా భావించి సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల నిరంతర డిమాండ్ కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఇటీవల 166 మెట్రిక్ టన్నుల బంగారాన్ని అధికారిక నిల్వలకు జోడించాయని ఆర్బీఐ బులెటిన్‌లో వెల్లడించింది. దీతో బంగారం డిమాండ్ మరింతగా పెరిగింది.