తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ‘జోహో వెంబు’ మార్గం

తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ‘జోహో వెంబు’ మార్గం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12  ఏళ్లు దాటింది. స్వరాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న ప్రజలు ఇంకెంతకాలం బంగారు తెలంగాణ ఆవిష్కారం కోసం ఎదురుచూడాలి. నీరసం నింపిన నేలలో నిప్పురవ్వయి, ఎగిసిపడి, సర్వం త్యాగం చేసిన బిడ్డలకు ప్రతిఫలాలు ఎక్కడ?  పాలనలో పరిపక్వత ఇంకెన్నడు సాధించేది. ఇప్పటికీ  తెలంగాణలో  పట్టణ ప్రాంతం అంటే హైదరాబాద్​ మహానగరంగానే గుర్తిస్తున్నారు.

 మిగతా పట్టణాలలో అన్ని రకాల సౌకర్యాలు అభివృద్ధి చెందకపోవడంతో  ప్రజల్లో నిరుత్సాహం కనబడుతోంది.   భారీ భవనాలు, రోడ్లు, ఐటీ కంపెనీలు, మౌలిక వసతులు ఇవన్నీ తెలంగాణ పురోగతికి  ప్రతీకలుగా నిలుస్తున్నాయి.  ఈ మెరుపుల  వెనుక ఒక నిజం దాగి ఉంది. నేటికీ  హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగులు, రైలు రింగులు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోని మిగతా పట్టణాలకు, గ్రామాలకు వెళ్లలేకపోతోంది. 

గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి వేగం అంతగా పెరిగి, ఇతర జిల్లాల చిన్న, మధ్య తరహా పట్టణాలు చాలా వెనుకుబాటుకు గురయ్యాయి. ఈ  పరిస్థితిని ఉప ప్రాంతీయ అసమానతగా చూడవచ్చు. రాష్ట్ర విధానాలు ఎక్కువగా రాజధాని మీదే కేంద్రీకృతమవ్వడం వల్ల, ఇతర పట్టణాల అభివృద్ధి అవకాశాలు నిలిచిపోయాయి. తెలంగాణలో పది జిల్లాలను 33 జిల్లాలుగా చేసినప్పటికీ, కనీసం ఆ జిల్లా కేంద్రాలలో  సగటు సదుపాయాలు కల్పించలేకపోవటం వల్ల అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ మాత్రమే తిరుగుతోంది.

.హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చెంది కేంద్రీకృతమై,  తెలంగాణలోని  మిగతా అన్ని జిల్లాలు వెనకబడ్డాయి.  విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక వసతులు చాలా జిల్లాల్లో మెరుగైన స్థాయికి చేరలేదు. ఉద్యోగాల కోసం, వ్యాపార అవకాశాల కోసం  యువత  పెద్ద ఎత్తున  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు  వలస వస్తున్నారు. దీని ఫలితంగా గ్రామాల సాంస్కృతిక జీవనం, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.  

మానవ సంబంధాలు,  నైతిక విలువలలో తీవ్రమైన లోపం కనిపిస్తోంది. జనాభా అంచనాల ప్రకారం 2036 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 57.3 శాతానికి చేరుకుంటుందని అంటే దేశ సగటుతో పోలిస్తే 12 శాతం ఎక్కువ పట్టణీకరణ జరగనుంది. ఇది అభివృద్ధి సూచిక అయినా, ఆ అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికే పరిమితమైతే దాని ప్రయోజనం తక్కువగానే ఉంటుంది. ద్వితీయ శ్రేణి నగరాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ఐటీ,  పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినప్పటికీ, నేటికీ ప్రకటనల రూపంలో ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

కొత్త జిల్లాలు...  పాత సమస్యలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమానంగా అభివృద్ధి చెందుతుందని ఆశ పెరిగింది. కానీ,  ఆ ఆశ ఇంకా పూర్తిగా నెరవేరలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా, వాటి ప్రధాన పట్టణాలకు  ప్రత్యేక  ప్రణాళికలు, పెట్టుబడులు ఎక్కువగా రావడం లేదు. అభివృద్ధి అర్థం హైదరాబాద్ చుట్టూ తిరిగే దశలోనే  నిలిచిపోయింది. పట్టణీకరణ పెరుగుతుండటమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలు కూడా ఒక్కచోటే  కేంద్రీకృతమవ్వడం ఒక ప్రమాద సంకేతం. ఈ విధానం కొనసాగితే రాష్ట్రం మొత్తం సామాజికంగా, సాంస్కృతికంగా అసమతుల్యంలో పడే అవకాశం ఉంది.

 గ్రామాలకు చేరని ఆవిష్కరణలు

ప్రస్తుతం టి-హబ్, వీ-హబ్ వంటి కార్యక్రమాలు స్టార్టప్‌‌‌‌లను  ప్రోత్సహిస్తున్నాయి.   కానీ, ఇవి ఎక్కువగా హైదరాబాద్‌‌‌‌కు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లాల యువతకు కూడా ఇలాంటి అవకాశాలు అందాలి.  నైపుణ్యాభివృద్ధి కోసం ‘టాస్క్’ వంటి  సంస్థలను  జిల్లాల ప్రధాన కేంద్రాలకు విస్తరించడం అత్యవసరం.  ఇది కేవలం ఉద్యోగాలకే కాదు.  ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత,  స్వయం ఉపాధి అవకాశాలను పెంచే దిశగా తీసుకువెళ్తుంది.  గతంలో ప్రభుత్వాలు ఐటీ పార్కులను జిల్లాలకీ తీసుకెళ్లాలనుకున్నా, అవి ఆచరణలో పెద్దగా సఫలీకృతం కాలేదు.  గ్రామీణ ప్రజల జీవితాల్లో సాంకేతిక ఫలాలు చేరాలంటే 
ఇంటర్నెట్,  డిజిటల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి.

  జిల్లా కేంద్రాల సామర్థ్యం

ఇప్పటి పరిస్థితుల్లో రవాణా, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు జిల్లాల్లో కూడా  అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న పట్టణాలు పరిశ్రమలు, సేవారంగం, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉన్నాయి. సరైన విధానాలు, పెట్టుబడులు ఉంటే ఇవి తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి కేంద్రాలుగా మారగలవు.  హైదరాబాద్‌‌‌‌తోపాటు  వరంగల్,  ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌‌‌‌నగర్, నల్గొండ వంటి పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తే మాత్రమే సమగ్ర తెలంగాణ సాధ్యమవుతుంది.

అభివృద్ధి అంటే కేవలం ఆర్థికవృద్ధి కాదు

 అభివృద్ధి అంటే కేవలం ఆర్థికవృద్ధి  మాత్రమే కాదు,  మన మూలాలను, సంస్కృతిని కాపాడుకుంటూ,  ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాన్ని పెంచే ప్రయాణం. ఆధునిక వ్యాపార ప్రపంచంలో జోహో  కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఒక నిజమైన ప్రేరణ.  తెలంగాణలో నగరాలకే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, సంస్కృతి మార్పు పెద్దదైన కేంద్రీకరణతో జరగడం సాధారణం. జోహో కార్పొరేషన్‌‌‌‌ను టేంకాసి గ్రామం నుంచి ప్రారంభించి, ప్రపంచ స్థాయి  సాఫ్ట్​వేర్​ సర్వీసులను తయారుచేశారు.  

తెలంగాణ అభివృద్ధి నమూనా గ్రామస్థాయిలో పట్టణ సౌకర్యాలు కల్పించి ఉద్యోగం, ఉపాధి కల్పించే విధంగా కార్యాచరణ తయారు చేసుకొని, వేగంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.  స్వయం ఉపాధిపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి, తగిన ప్రోత్సాహకాన్ని అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత జీవితాలలో వెలుగులు పెంపొందించేవిధంగా ఉండాలి.

సమతుల అభివృద్ధి సమగ్ర తెలంగాణ

అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు, కంపెనీలు కాదు.  ప్రతి ప్రాంతంలో అవకాశాలు, జీవన ప్రమాణాలు పెరగడం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ నిజమైన అభివృద్ధి అంటే హైదరాబాద్‌‌‌‌లో ఉన్న సౌకర్యాలు, అవకాశాలు ప్రతి జిల్లాకి చేరడం.  ఇందుకోసం  ప్రభుత్వాలు  మాత్రమే కాకుండా,  ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు, పౌర సమాజం కలిసి కృషి చేయాలి. సమానత్వం, న్యాయం, సామాజిక సమగ్రత ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకుంటేనే  తెలంగాణ రాష్ట్రం తన నిజమైన శక్తిని అందుకుంటుంది. 

హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణకు గర్వకారణం. కానీ, ఆ వెలుగు తెలంగాణ మొత్తం  సమానంగా ప్రకాశించాలి. ప్రతి జిల్లా కేంద్రం, ప్రతి చిన్న పట్టణం  స్థానిక వనరులతో, ప్రతిభతో ఎదగగలదనే విశ్వాసం కల్పించాల్సిన సమయం వచ్చింది.  వేంబో చూపిన మార్గం మనందరికీ ఒక పాఠం కావాలి. అభివృద్ధి నగర సరిహద్దుల్లో ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఉపాధి కోసం పట్టణాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళిక, అవకాశాలు, స్థానిక నైపుణ్యాలు ఉంటే తెలంగాణ ప్రతి మూలలో అభివృద్ధి జరుగుతుంది.

అభివృద్ధికి కొత్తపాఠం ‘జోహో’

తమిళనాడులోని  టేంకాసి గ్రామం నుంచే  జోహో కార్పొరేషన్‌‌‌‌ను నడుపుతున్న శ్రీధర్ వెంబు ఉదాహరణ మనకు కొత్త ఆలోచన ఇస్తుంది. ఒక చిన్న గ్రామం నుంచే ప్రపంచ స్థాయి సాఫ్ట్​వేర్ సంస్థను విజయవంతంగా నడపడం ద్వారా ఆయన చూపించినది ఏంటంటే  ప్రతిభ నగరాలకే పరిమితం కాదని.   హైదరాబాద్‌‌‌‌లో అవకాశాలు కేంద్రీకృతమవడం వల్ల ప్రతిభ వలస జరుగుతుండగా,   జోహో మోడల్ మాత్రం  ‘డీసెంట్రలైజ్డ్ డెవలప్‌‌‌‌మెంట్’ అనే కొత్త దిశ చూపిస్తోంది.  

గ్రామాల్లోనే  పనిచేసే ఉద్యోగులు తమ సంస్కృతితో, కుటుంబంతో దగ్గరగా ఉండగలుగుతున్నారు. ఇది ఆర్థికాభివృద్ధితోపాటు సామాజిక సమతుల్యతను కూడా తీసుకువస్తోంది. తెలంగాణ కూడా ఇలాంటి దిశగా ఆలోచించాలి. జిల్లాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు,  పాలిటెక్నిక్‌‌‌‌లు,  స్థానిక  నైపుణ్య కేంద్రాలను పరిశ్రమలతో కలిపితే గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి.

‌‌‌‌‌‌‌‌ - చిట్టెడి కృష్ణారెడ్డి, 
అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్​సీయూ