మృత్యురాయి..! వరంగల్_ఖమ్మం జాతీయ రహదారి 563 పై గ్రానైట్ లారీల బీభత్సం.. పెరుగుతున్న ప్రమాదాలు

మృత్యురాయి..! వరంగల్_ఖమ్మం జాతీయ రహదారి 563 పై గ్రానైట్ లారీల బీభత్సం.. పెరుగుతున్న ప్రమాదాలు
  •    జాతీయ రహదారులపై గ్రానైట్​లారీల బీభత్సం
  •     గ్రానైట్​తరలింపులో ఇష్టారాజ్యం 
  •     పెరుగుతున్న ప్రమాదాలు
  •     నిరంతర తనిఖీలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు

మహబూబాబాద్, వెలుగు:  జిల్లాలో వరంగల్​_ఖమ్మం జాతీయ రహదారి 563 పై గ్రానైట్​లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓవర్​లోడ్, అతివేగం, మద్యం సేవించి లారీలను నడుపడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఓవర్​ లోడ్ మూలంగా బీటీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లా నుంచి తొర్రూరు, మరిపెడ పట్టణాల మీదుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం ఖమ్మం, చెన్నై, బెంగళూర్, ఇతర సుదూర ప్రాంతాలకు గ్రానైట్​లోడ్స్​ వెళ్తుంటాయి. అనుమతి పొందిన సామర్ధ్యం కంటే ఎక్కువ మొత్తంలో గ్రానైట్​ షీట్లను లారీల్లో తరలించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

జిల్లాలో పెరుగుతున్న ప్రమాదాలు.. 

మానుకోట జిల్లాలో 168 బ్లాక్​ గ్రానైట్లు, 2 కల్లర్​ గ్రానైట్లు, బెరైటీస్, డోలమైట్, క్వర్ట్జ్, స్టోన్​ మెటల్​ మొత్తంగా 197 క్వారీలకు అనుమతులున్నాయి. రాత్రి వేళల్లో గ్రానైట్​అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. నిత్యం ఉమ్మడి వరంగల్​ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు 500 పైగా గ్రానైట్ లోడ్​లారీలు తరలిస్తున్నారు. తరచూ తనిఖీలను చేపట్టావలసిన విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్, మైనింగ్​ఆఫీసర్లు, పోలీస్​ ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే భారీస్థాయిలో ఫైన్​ విధించవలసి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు.

గ్రానైట్​తరలింపులో అనేక అక్రమాలు..

గ్రానైట్​షీట్లను ఒక లారీ పై 4 మెట్రిక్​టన్నుల బరువు వరకు మాత్రమే తరలించవలసి ఉండగా, గ్రానైట్​నిర్వాహకులు యథేచ్ఛగా 7 మెట్రిక్​ టన్నులకు పైగా గ్రానైట్​షీట్లను ఒకే సమయంలో తరలిస్తున్నారు. లారీ పై గ్రానైట్​షీట్​ లోడ్​చేసిన క్రమంలో చుట్టూ ఇనుప గొలుసుతో రక్షణ కల్పించడం, షీట్​కనపడకుండా టార్పాలిన్​ ఏర్పాటు చేయడం, లారీ సైజ్​దాటి రాకుండా షీట్​లోపల ఉండేలా చూడటం, వాహనాలు అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.

వరుస ప్రమాదాలతో వణుకు.

 రెండేండ్ల కింద మానుకోట జిల్లాలోని కురవి మండంలో గ్రానైట్​బండరాయి పక్కనే వెళ్తున్న ఆటో పై పడి ముగ్గురు మృతిచెందారు. 

 2025 మార్చి 11న హనుమకొండ జిల్లా సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద ఇన్నోవా కారును తప్పించబోయి గ్రానైట్ లారీ డ్రైవర్ డివైడర్​ ను ఢీకొట్టాడు. ప్రమాదంలో లారీ డ్రైవర్​తోపాటు కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. గ్రానైట్ బండలు కింద పడటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పోల్స్, సీసీ కెమెరాలు దెబ్బతిన్నాయి.

 జూలై 5న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట శివారులో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ డ్రైవర్లు, క్లీనర్ తో కలసి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

 ఈనెల17న తొర్రూరు మండలం మాటేడు వద్ద గ్రానైట్ లారీ మేతకు వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 2 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
 ఈ నెల 21న తెల్లవారు జామున తొర్రూరు బస్టాండ్​ సెంటర్​ వద్ద గ్రానైట్​లారీ అతి వేగంతో డివైడర్​ను ఢీ కొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్​ తీవ్రంగా గాయపడ్డారు. భారీ గ్రానైట్​ షీట్లు ప్రదానరహదారి పై పడ్డాయి. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

చర్యలు చేపట్టాలి..

జిల్లాలో అనుమతి పొందిన వే బిల్లులకు విరుద్ధంగా అధిక మొత్తం లోడ్​తో గ్రానైట్​ షీట్లను ఒకే లారీ పై తరలిస్తున్నారు. డ్రైవర్లు తాగిన మైకంలో, నిద్ర సరిగ్గా లేకపోవడం, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖమ్మం_ వరంగల్​ హైవేపై అనేకచోట్ల భారీ గుంతలు పడ్డాయి. నిబంధనలు పాటించని గ్రానైట్​లారీలను సీజ్​చేయాలి, తక్షణం అధికారులు కఠిన చర్యలను  చేపట్టాలి.- ధరావత్​ జైసింగ్, తొర్రూరు, మహబూబాబాద్​జిల్లా