బీసీ హక్కుల కోసం డిజిటల్ ఉద్యమం అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు

బీసీ హక్కుల కోసం డిజిటల్ ఉద్యమం అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు

అబిడ్స్, వెలుగు: బీసీ సమస్యలను రాజ్యాంగ హక్కులు, విధాన రూపకల్పన, పరిపాలనలో భాగస్వామ్యం అనే విస్తృత దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ టి. చిరంజీవులు అన్నారు. బీసీల హక్కుల కోసం యువత డిజిటల్ ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

మంగళవారం గన్ ఫౌండ్రిలోని బీసీ జేఏసీ ఆఫీస్​లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన నిర్వహించిన కార్యాచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా ఉద్యమాలను విస్తరించాలన్నారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ.. సోషల్​ మీడియాను వినోదానికి మాత్రమే కాకుండా బీసీ హక్కుల సాధనకు వినియోగించాలని సూచించారు. ఏఐసీసీ నాయకుడు కత్తి వెంకటస్వామి, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వీజేఆర్ నారగోని, మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కర్నాటి ధనుంజయ్, బీసీ సంఘం మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.