సెంటినల్‌ డిజిటల్ సోల్జర్‌ టూల్ తో సైబర్ నేరస్తుల గుర్తింపు

సెంటినల్‌ డిజిటల్ సోల్జర్‌ టూల్ తో సైబర్ నేరస్తుల గుర్తింపు
  • ఏఐ ఆధారిత సెంటినల్‌ టూల్​తో సైబర్  నేరస్తుల గుర్తింపు
  •     ఐఓ రూమ్‌ నుంచే దర్యాప్తు
  •     క్రిమినల్స్​ను ట్రేస్‌ చేస్తున్న  సెంటినల్  డిజిటల్  సోల్జర్‌

హైదరాబాద్,వెలుగు: సైబర్ క్రైం పోలీసులకు మరో అధునాత టూల్‌  అందుబాటులోకి వచ్చింది. ‘సెంటినల్‌’ అనే ఏఐ  టూల్‌  ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌  పోలీసుల కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషిస్తోంది. సైబర్  నేరాల దర్యాప్తులో డిజిటల్  సోల్జర్‌‌గా సాయపడుతోంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌‌(ఐఓ) కు ఆన్‌లైన్‌లోనే సెర్చ్‌  ఆపరేషన్‌  డేటా అందిస్తోంది. 

ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న సైబర్  నేరాలు, మ్యూల్‌ అకౌంట్లు సహా సైబర్  నేరగాళ్లను గుర్తించడంలో అత్యంత వేగంగా సెంటినల్‌  డిజిటల్  సోల్జర్‌  పనిచేస్తోంది. సైబర్  నేరాలకు గురైన బాధితులు మొదట 1930  లేదా  నేషనల్‌  సైబర్ క్రైం రిపోర్టింగ్‌  పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తుంటారు. 

ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయా నేరానికి సబంధించిన పూర్తి సమాచారం సైబర్  సెక్యూరిటీ బ్యూరో డేటాబేస్‌లో  నిక్షిప్తం అవుతుంది. ఇలాంటి డేటాను డిజిటల్‌  సోల్జర్ సెంటినల్  విశ్లేషిస్తుంది. ఇన్వెస్టిగేషన్  అధికారులు ఫీల్డ్‌  విజిట్‌  చేయకుండానే ఇన్‌ హౌస్‌ నుంచే  సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సైబర్  నేరగాళ్లు వినియోగించిన బ్యాంక్  అకౌంట్లు, ఫోన్‌ నంబర్లు, ఐపీ అడ్రెస్‌లు సహా ఆయా వ్యక్తులకు చెందిన ప్రాథమిక సమాచారాన్ని సెంటినల్‌  సేకరిస్తుంది.

నేరగాళ్లను గుర్తించి పట్టించే దాకా 

ఆన్‌లైన్‌  సెర్చ్‌  ఆపరేషన్‌లో సేకరించిన డేటా ఆధారంగా సర్వీస్  ప్రొవైడర్లకు, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం, బ్యాంకులు, సోషల్‌ మీడియా కంపెనీలు సహా కేసుకు సంబంధించిన సంస్థలకు ఆటోమెటిక్‌గా సమాచారం చేరుతుంది. ప్రధానంగా ఇంటర్నెట్‌  ప్రొటోకాల్‌ లాగ్స్, కాల్‌ డేటా రికార్డ్స్‌,‌ కేవైసీ సహా పూర్తి సమాచారాన్ని సెంటినల్‌  సోల్జర్‌‌  సేకరిస్తుంది. ఇలా సేకరించిన సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేస్తుంది. దీంతో అతితక్కువ సమయంలోనే దర్యాప్తు అధికారుల అరచేతిలో నేరగాళ్ల చిట్టా ఉంటుంది.