కెమెరాను పల్లెబాట పట్టించిన దర్శక శిఖరం భారతీరాజా ప్రస్థానం ..

కెమెరాను పల్లెబాట పట్టించిన దర్శక శిఖరం భారతీరాజా ప్రస్థానం ..

పల్లెటూరి మట్టి పరిమళాన్ని, సామాన్య జీవితాల్లోని భావోద్వేగాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, మానవ సంబంధాల్లోని సౌందర్యాన్ని దృశ్యకావ్యంలా వెండితెరపై స్పృశించిన దర్శక శిఖరం భారతీరాజా. ఆయన సినిమాలన్నీ  టైమ్‌‌‌‌లెస్‌‌‌‌ క్లాసిక్స్‌‌‌‌. గ్రామీణ జీవన శైలిని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన దర్శకుడిగా ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.

అద్భుతమైన సృజనాత్మకత, తనదైన శైలితో భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా(84) కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గత ఏడాది ఆయన కొడుకు మనోజ్ భారతీరాజా (48) హార్ట్‌‌‌‌ ఎటాక్‌‌‌‌తో మరణించడం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. గత ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ చెన్నైలోని తన నివాసంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

దర్శకశిఖరం 

భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్‌‌‌‌‌‌‌‌. సినిమాల్లోకి వచ్చాక భారతీరాజాగా మార్చుకున్నారు. 1941, జులై 17న తమిళనాడు తేని జిల్లా అల్లినగరంలో పుట్టారు. 1977లో వచ్చిన ‘16 వయథినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన దాదాపు నలభై చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్రామీణ అందాలను వెండితెరకెక్కించడంతో ‘ఇయక్కునార్‌‌‌‌‌‌‌‌ ఇమయం’ (దర్శక శిఖరం)గా పేరుగాంచారు. కేవలం రూరల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌ సినిమాలే కాకుండా ‘సిగప్పు రోజాక్కల్‌‌‌‌’ (తెలుగులో ఎర్ర గులాబీలు) లాంటి సైకో థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తోనూ మెప్పించారు. కులవివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ చిత్రం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. 

కెమెరాను పల్లె బాట పట్టించి.. 

సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్స్‌‌‌‌ కాదు.. అదొక సజీవమైన దృశ్యకావ్యం అని నిరూపించారు భారతీరాజా. అప్పటివరకూ ఉన్న సంప్రదాయ సినిమా ఫార్మాట్‌‌‌‌ను బద్దలు కొట్టి, వెండితెరకు సరికొత్త రంగులు అద్దిన సృజనశీలి.  ఎక్కువగా స్టూడియో సెట్లలో జరిగే షూటింగ్స్‌‌‌‌ను పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి రోడ్ల పైకి తీసుకెళ్లి అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు. కేవలం పల్లె అందాలను చూపించడం కాకుండా అక్కడి కుల వివక్ష, మూఢనమ్మకాలు, పగలు, ప్రతీకారాలు లాంటి సున్నితమైన సామాజిక అంశాలను వాస్తవికతకు అద్దం పట్టేలా తన చిత్రాల్లో చూపించారు భారతీరాజా. 

సహజత్వానికి దగ్గరగా..

హీరోహీరోయిన్స్‌‌‌‌ను ఎక్కువ మేకప్‌‌‌‌ లేకుండా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌తో మన పక్కింటి అబ్బాయిలా, అమ్మాయిలా చూపించేవారు భారతీరాజా. నటీనటుల నుంచి అత్యుత్తమ నటన రాబట్టుకోవడంలో ఆయన దిట్ట. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి దిగ్గజ నటీనటులకు కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్ క్యారెక్టర్స్‌‌‌‌ ఇచ్చారు. రాధిక, రేవతి, రాధ, రంజని, రేఖ లాంటి వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వీళ్లందరి పేర్లు ‘ఆర్‌‌‌‌‌‌‌‌’ అక్షరంతోనే ప్రారంభమవడం విశేషం.  

పొయిటిక్‌‌‌‌ విజువల్స్‌‌‌‌

లవ్‌‌‌‌ సీన్స్‌‌‌‌ తీయడంలో భారతీరాజా స్టయిలే వేరు. నటీనటుల కళ్ల కదలికలు, ప్రకృతి పరవశాలతో ప్రతి సీన్‌‌‌‌ను ఓ దృశ్యకావ్యంగా తీర్చిదిద్దేవారు. అందుకే ఆయన్ను ‘సినిమా కవి’ అని పిలుస్తారు. అంతేకాదు ఆయన సినిమాల్లో సంగీతం కేవలం పాటల్లో కాకుండా ఆ కథలో ఓ భాగమై ఉండేది. భారతీరాజా పొయిటిక్‌‌‌‌ విజువల్స్‌‌‌‌ను ఇళయరాజా సంగీతం మరింత ఎలివేట్‌‌‌‌ చేసేది. ఈ ఇద్దరి కాంబినేషన్‌‌‌‌ ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్‌‌‌‌గా నిలిచింది.  

తెలుగులోనూ చెరగని ముద్ర

భారతీరాజా తొలిచిత్రం ‘16 వయదినిలే’ను తెలుగులో ‘పదహారేళ్ల వయసుగా’ రీమేక్ అయింది.  ఇక హరిప్రసాద్, సుహాసిని జంటగా తీసిన ‘కొత్త జీవితాలు’ తెలుగులో ఆయనకు తొలిచిత్రం.  ‘పుదియ దార్పుగళ్‌‌‌‌’ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఆ తర్వాత ఆయన తెలుగులో తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌గా నిలిచింది.  

అలాగే ‘ఆరాధన’ చిత్రంతో చిరంజీవిని కొత్తగా ప్రజెంట్ చేశారు. కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. తమిళంలో ఆయన తీసిన ‘కిళక్కే పోగుం రైల్‌‌‌‌’ చిత్రం బాపు డైరెక్షన్‌‌‌‌లో ‘తూర్పు వెళ్లే రైలు’గా వచ్చింది. శివాజీ గణేశన్‌‌‌‌, రాధతో తీసిన ‘ముదల్‌‌‌‌ మారియాదై’ తెలుగులో ‘ఆత్మబంధువుగా’ ఆకట్టుకుంది. అలాగే ‘మన్‌‌‌‌ వాసనై’ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘మంగమ్మ గారి మనవడు’గా కోడిరామకృష్ణ తీశారు. మరికొన్ని అనువాద చిత్రాలుగా తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. 

నటుడిగానూ.. 

దర్శకుడిగానేకాక నటుడిగానూ ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు.  యువ, పాండియనాడు, ఈశ్వరన్‌‌‌‌, తిరు, మహారాజా లాంటి ఇరవై చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. మోహన్‌‌‌‌ లాల్‌‌‌‌ ‘తుడరుమ్‌‌‌‌’లో చివరిసారిగా కనిపించారు. ఆయన నటించిన ‘పులవర్‌‌‌‌‌‌‌‌’ విడుదల కావల్సి ఉంది.   

ప్రముఖుల నివాళులు

గ్రామీణ జీవన శైలిని సహజంగా తెరపై ఆవిష్కరించిన అద్భుత దర్శకుడిని,  ఒక గొప్ప లెజెండ్‌‌‌‌ను కోల్పోయామని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసంలో భారతీరాజా పార్థివదేహానికి నటులు కమల్ హాసన్‌‌‌‌, రజినీకాంత్, సూర్య, రాధిక, ఉదయనిధి స్టాలిన్‌‌‌‌, కీర్తి సురేష్‌‌‌‌ తదితరులు నివాళులు అర్పించారు. 

తమిళ చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతున్నట్టు సీఎం విజయ్‌‌‌‌ తెలియజేశారు.  భారతీరాజా డైరెక్షన్‌‌‌‌లో వచ్చిన ‘ఆరాధన’ చిత్రంలో తాను పులిరాజు పాత్రను పోషించే అద్భుతమైన అదృష్టం దక్కిందని, ఆ సినిమా సమయంలో ఆయన తనపై చెరగని ముద్ర వేశారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌‌‌,  పలువురు టాలీవుడ్‌‌‌‌ సెలబ్రిటీస్‌‌‌‌ సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. 

పద్మశ్రీ, 6 నేషనల్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌

భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దర్శకుడిగా ఆయన 6 జాతీయ అవార్డులను అందుకోవడం విశేషం. అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం (సీతాకోక చిలుక చిత్రానికి), 4 ఫిల్మ్‌‌‌‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.