నిర్భయను కదిలించిన దిశ

నిర్భయను కదిలించిన దిశ

క్షమాభిక్ష వద్దని రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ రిపోర్ట్
ఇప్పటికే ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ నోట్
తొందరలోనే నిందితులకు ఉరిశిక్ష అమలు?

న్యూఢిల్లీ, వెలుగు: దేశం మొత్తాన్ని కుదిపేసిన దిశ హత్య సంఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నిందితులను ఎప్పుడు శిక్షిస్తారన్న ప్రశ్నలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కోర్టు విచారణ పూర్తై శిక్షలు ఖరారైనా క్షమాభిక్ష అప్లికేషన్ పెండింగ్ లో ఉంది. హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు నిర్భయ కేసులోనూ ప్రభుత్వాలను కదిలించాయి. ఈ కేసు నిందితుడికి క్షమాభిక్షను ఇవ్వద్దని రికమెండ్ చేస్తూ ఈనెల 1నే ఢిల్లీలో కేజ్రివాల్ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు రిపోర్ట్ పంపించింది. నేరం సీరియస్ ను బట్టి క్షమాభిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు నోట్ లో పేర్కొంది. ఈ నోట్ వచ్చిన మూడు రోజుల్లోనే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మెర్సీ పిటిషన్ ను తిరస్కరించాలంటూ కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ అందించారు. దీనిపై రెండు రోజుల్లోనే హోంశాఖ కూడా నిర్ణయం తీసుకుంది. నిందితుడి క్షమాభిక్షను తిరస్కరించాలని శుక్రవారం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.

ఇక రాష్ట్రపతి నిర్ణయమే ఫైనల్

హోం శాఖ రికమెండేషన్​తో ఇక రాష్ట్రపతి నిర్ణయమే మిగిలింది. ఢిల్లీ సర్కారు నుంచి హోంశాఖ వరకు అందరూ క్షమాభిక్షను రిజెక్ట్ చేయాలనే చెప్పడంతో రాష్ట్రపతి కోవింద్ కూడా అదే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో త్వరలోనే నిర్భయ కేసు నిందితులకు మరణశిక్ష అమలయ్యే అవకాశం ఉంది.

ఒక్కడిదే మెర్సీ పిటిషన్

2012 డిసెంబర్ 16న జరిగిన నిర్బయ ఘటనలో ఒక మైనర్ సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏడాదిలోపే విచారణ పూర్తిచేసి 2013 సెప్టెంబర్ 10న ఢిల్లీ కోర్టు తీర్పుచెప్పింది. మైనర్ నిందితులకు మూడేళ్ల కంటే ఎక్కువ శిక్షవేయకూడదన్న నిబంధన ఉండడంతో అంతే శిక్ష విధించారు. తర్వాత అతడు విడుదలయ్యాడు. విచారణ సమ యంలో నిందితుల్లో ఒకరు రామ్ సింగ్  ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు వినయ్ శర్మ, ముకేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ కు మరణశిక్ష విధించారు. దీనిపై అప్పీళ్ల విచారణ పూర్తయ్యాక 2017 మే 5న సుప్రీంకోర్టు మరణశిక్షలను ఖరారు చేసింది. ఆ తర్వాత నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష అప్లికేషన్ పెట్టుకున్నాడు. ముకేష్ సింగ్ మెర్సీ పిటిషన్ పెట్టడానికి ఇష్టపడలేదు. మరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ సుప్రీంలో రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు. వినయ్ ఒక్కడి క్షమాభిక్ష దరఖాస్తు వల్లే శిక్ష అమలుకాలేదు. నిర్భయ ఘటన తర్వాత ఇప్పుడు దిశ హత్య అదే స్థాయిలో దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇన్నేళ్లయినా ఘోరమైన నేరాల్లో శిక్షలు అమలు కావడం లేదన్న ఆవేశం, ఆవేదన జనంలో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో పెండింగ్ లో ఉన్న వినయ్ అప్లికేషన్ పై కదలిక వచ్చింది.