అనారోగ్యం అయినా.. రోగం వచ్చినా.. ముందుగా ఆస్పత్రి కంటే మనకు కనిపించేది.. గుర్తుకొచ్చేది మెడికల్ షాపు. ముందు ఓ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని ఉపశమనం పొందుదాం.. ఆ తర్వాత ఆస్పత్రికి వెళదాం అనుకుంటాం.. అలాంటి మెడికల్ షాపులోనే నకిలీ మందులు అమ్ముతున్న దుర్మార్గులు తయారు అయ్యారు. హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది.
తెలంగాణ రాష్ట్రం జనగాం, సిరిసిల్ల జిల్లాల్లో మెడికల్ షాపుల్లోనే.. డ్రగ్ లైనెస్స్ లేకుండా నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులను గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కిడ్నీల్లో రాళ్లు, ఊబకాయం తగ్గుతుంది అంటూ నకిలీ మందులను.. మెడికల్ షాపుల్లోనే విక్రయిస్తున్నారు ఓనర్లు. ఈ విషయాన్ని గుర్తించి ఆయా మెడికల్ షాపులపై కేసులు నమోదు చేశారు అధికారులు.
బరువు తగ్గుతారు అంటూ మెడికల్ షాపుల్లో అమ్ముతున్న మందులకు డ్రగ్ కంట్రోల్ నుంచి అనుమతి లేదని.. అదే విధంగా కిడ్నీలో రాళ్లు ఇట్టే పోతాయంటూ అమ్ముతున్న మెడిసిన్స్ కూడా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ నుంచి పర్మీషన్ ఇవ్వలేదని స్పష్టం చేసిన అధికారులు.. ఆయా మందులను సీజ్ చేయటంతోపాటు.. ఆయా మెడికల్ షాపులపై కేసులు నమోదు చేశారు.