ఇవాళ సాయంత్రం హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. స్టేట్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరగనున్న మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై మాట్లాడనున్నారు.
మరోవైపు పీసీసీ ఎన్నికల కమిటీలో చోటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సీనియర్ నేత , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు ఎన్నికల కమిటీలో చేర్చుకోవడంపై మండిపడుతున్నారు ఆయన వర్గీయులు. పొన్నం ప్రభాకర్ కు మద్ధతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఇవాళ ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ బయల్దేరారు. సాయంత్రంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు.
