- పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: దివ్య దేవరాజన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడంతో పాటు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడకూడదని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని అడిషనల్ కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించి 13 అంశాలపై కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. గ్రామ పంచాయతీ భవనాలపై తప్పనిసరిగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల వద్ద కూడా సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు.
99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తడి, -పొడి చెత్తను వేరుచేసి సేకరించడం ద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని, హైవేలు, గ్రామాల ప్రధాన రహదారులపై ఉన్న ప్లాస్టిక్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రతి నెలా 6వ తేదీన గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో కచ్చితంగా నీటి ట్యాంకులను శుభ్రం చేయాలనిసూచించారు. పంచాయతీల్లో చేపట్టే ఏ పనికైనా గ్రామసభ అనుమతి తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
