
ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ సతీమణి, నటి దివ్య ఖోస్లా కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివ్య తల్లి అనిత ఖోస్లా కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా దివ్య ఖోస్లా తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు.
'అమ్మా.. నా మనసు ముక్కలైంది.. నా తల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది. కానీ నా హృదయంలో మాత్రం పదిలంగా ఎప్పటికీ ఉండిపోతుంది. నీకు కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. లవ్ యూ మమ్మా.. ఇట్లు అనితా ఖోస్లా కూతురు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
దివ్య ఖోస్లా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2004లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇదే తొలిచిత్రం. ఆ తర్వాత అబ్ తుమారే హవాలే వాటా సాథియో సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.
2005 ఫిబ్రవరి 13న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ను పెళ్లాడింది. వీరికి 2011లో ఓ బాబు జన్మించాడు. పెళ్లి తరువాత నటిగా దూరమైన దర్శకనిర్మాతగానూ పలు సినిమాలు చేసింది. అటు భూషణ్ కుమార్ నిర్మించిన ఆదిపురుష్ చిత్రం ఇటీవల విడుదలై అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.