- డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్/ ముషీరాబాద్, వెలుగు: డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
ఆయా జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని జిల్లా కమిటీలకు సూచించింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌జర్నలిస్టుల పాల్గొనాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం బాగ్‌లింగంపల్లిలో డీజేఎఫ్ టీ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాదిని ఉపేందర్, ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
వర్కింగ్ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో నెంబర్ 252ను సవరించాలన్నారు. డెస్క్ జర్నలిస్టులకు ఎప్పటిలాగే అక్రెడిటేషన్లు ఇవ్వాలని, అలాగే స్పోర్ట్స్, సినిమా, ఫీచర్స్, వెబ్, కల్చరల్, బిజినెస్ డెస్క్ జర్నలిస్టులతో పాటు కార్టూనిస్టులకు కూడా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కేఎన్ రాజారామ్, కోశాధికారి నిస్సార్, జాయింట్ సెక్రటరీ విజయ తదితరులు పాల్గొన్నారు. కాగా, డీజేఎఫ్టీ కార్యక్రమాలకు రాష్ట్రంలోని టీడబ్ల్యూజేఎఫ్, టీడబ్ల్యూజేఎఫ్(143), హెచ్ యూజే, ఎస్‌జేఏటీ, డబ్ల్యూఐజే తదితర జర్నలిస్టు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
