జూన్‌‌‌‌‌‌‌‌ 3న సీఎంగా డీకే ప్రమాణం...సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక

జూన్‌‌‌‌‌‌‌‌ 3న సీఎంగా డీకే ప్రమాణం...సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
  • డీకే పేరును ప్రతిపాదించిన సిద్ధరామయ్య
  • బలపరిచిన సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత పరమేశ్వర  
  • కర్నాటక గవర్నర్‌‌‌‌‌‌‌‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన డీకే
  • డిప్యూటీ సీఎంగా ఇద్దరికి చాన్స్‌‌‌‌‌‌‌‌ 
  • సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కీలక పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో!

బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే  శివకుమార్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. లోక్ భవన్ ప్రాంగణంలోని గ్లాస్ హౌస్‌‌‌‌లో జూన్ 3న ఆయన కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నూతన నాయకుడిగా శివకుమార్‌‌‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సిద్ధ రామయ్య ప్రవేశపెట్టగా, సీనియర్ నేత పరమేశ్వర బలపరిచారు. ఈ తీర్మానానికి శాసనసభాపక్షం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గడిచిన మూడేళ్లలో ప్రజలకు, పార్టీకి సిద్దరామయ్య అందించిన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

అనంతరం పార్టీ నేతలతో కలిసి లోక్​ భవన్​కు వెళ్లిన డీకే.. గవర్నర్ థావర్​ చంద్ గెహ్లాట్​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య సమర్పించిన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించి, మంత్రి మండలిని రద్దు చేశారు.

సాదాసీదాగా ప్రమాణ స్వీకారం

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 3న లోక్ భవన్ గ్లాస్ హౌస్‌‌‌‌లో జరగనుందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు జీసీ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. ‘‘మొదట బహిరంగ ప్రదేశంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించాం. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను తరలించేందుకు 10 వేల నుంచి 15 వేల బస్సులను బుక్ చేయాలని కూడా చర్చించాం. 

అయితే, ట్రాఫిక్ సమస్యలు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాం. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎలాంటి ఆడంబరాలు, హంగూ ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా, సేవా భావం ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించనున్నాం” అని తెలిపారు. బెంగళూరు నగర ప్రజలకు, ట్రాఫిక్‌‌‌‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వేదిక వద్దకు గుంపులుగా రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సిద్ధరామయ్యకు డీకే కృతజ్ఞతలు

తనను సీఎంగా ఎన్నుకున్న అనంతరం డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం సిద్ధరామయ్యపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ‘‘వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవాలి.. కానీ సుదూర ప్రయాణం చేయాలనుకుంటే అందరూ కలిసి నడవాలి.. అనే సామెత ఉంది. అదే స్ఫూర్తితో కర్నాటక ప్రజల శ్రేయస్సు కోసం మేమంతా కలిసికట్టుగా ముందడుగు వేస్తాం. సిద్ధరామయ్య మార్గదర్శకత్వం భవిష్యత్తులోనూ మాకు స్ఫూర్తినిస్తుంది” అని అన్నారు.

నాయకత్వ మార్పునకు కారణం ఇదేనా?

2023 మే నెలలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటి నుంచే సిద్ధ రామయ్య, శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం గట్టి పోటీ నెలకొన్నది. ఆ సమయంలో హైకమాండ్ జోక్యం చేసుకుని ‘రొటేషన్ పద్ధతి’ (సగం కాల పరిమితి ఫార్ములా) పై ఇరు నేతలను ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. 2025 నవంబర్ 20 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో.. ముందస్తు ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్‌‌‌‌కు పట్టాభిషేకం ఖాయమైంది. కాగా, సిద్ధరామయ్య 

నిష్క్రమణ తర్వాత పార్టీలో 

ఎలాంటి అసంతృప్తులు తలెత్తకుండా హైకమాండ్ జాగ్రత్తపడుతోంది. డీకే శివకుమార్‌‌‌‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకరు దళిత సామాజిక వర్గం నుంచి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కూడా ఈ కొత్త కేబినెట్‌‌‌‌లో కీలక పోర్ట్‌‌‌‌ఫోలియో దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

జూన్‌‌‌‌ 3నే ప్రమాణం ఎందుకంటే?

సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత డీకే శివకుమార్​ జర్నలిస్టులతో మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ సాయంత్రం 4:10 గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే, డీకే  జూన్ 3వ తేదీనే ముహూర్తంగా ఎంచుకోవడం వెనుక ఆసక్తికరమైన రాజకీయ, జ్యోతిష్య కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దైవభక్తి మెండుగా ఉన్న డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార సమయం కోసం తన ఆస్థాన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌‌‌‌ ను సంప్రదించినట్టు సమాచారం. 

ఆయన సూచనల మేరకే జూన్ 3న సాయంత్రం 4:10 గంటల సమయాన్ని ‘శుభ ముహూర్తం’గా ఖరారు చేశారు. లోక్‌‌‌‌భవన్ గ్రౌండ్స్‌‌‌‌లోని గ్లాస్ హౌస్‌‌‌‌లో అత్యంత సాదాసీదాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ శుభ ముహూర్తంతోపాటు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆ రోజు అందుబాటులో ఉండటం మరో కారణమని తెలుస్తున్నది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరుకానున్నారు. ఆయన షెడ్యూల్‌‌‌‌ను బట్టి కూడా జూన్ 3వ తేదీని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.