అనుమతి లేకుండానే... అడ్మిషన్లు నడుస్తున్నయ్! హైదరాబాద్‌‌లో ఏపీ మాజీ ఎమ్మెల్యే ‘డిగ్రీ’ దందా

అనుమతి లేకుండానే... అడ్మిషన్లు నడుస్తున్నయ్!  హైదరాబాద్‌‌లో ఏపీ మాజీ ఎమ్మెల్యే ‘డిగ్రీ’ దందా

 

  • అనుమతి లేకుండానే... అడ్మిషన్లు నడుస్తున్నయ్!
  • హైదరాబాద్‌‌లో ఏపీ మాజీ ఎమ్మెల్యే ‘డిగ్రీ’ దందా
  •  పర్మిషన్‌‌ రాకముందే ‘ఆదిత్య’ బ్రాండ్‌‌ పేరుతో హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో ప్రచారం
  •  ఇప్పటికే 10 కాలేజీలు కొనుగోలు.. మరికొన్నింటిపై కన్ను 
  •  పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.. ఇటీవల సీపీకి ఓయూ ఆఫీసర్ల లేఖ 
  •   ఇంటర్‌‌ తర్వాత ఇప్పుడు డిగ్రీపైనా ఆంధ్రా విద్యాసంస్థల పెత్తనం !

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్‌‌పై ఆంధ్రా విద్యాసంస్థల పెత్తనం ముదురుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌‌ విద్యను కార్పొరేట్ గుప్పిట్లోకి తీసుకున్న ఏపీకి చెందిన విద్యా వ్యాపారులు.. ఇప్పుడు డిగ్రీ కాలేజీలపై కన్నేశారు. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్‌‌ను అడ్డాగా చేసుకుని ‘డిగ్రీ దందా’కు తెరలేపారు. సర్కారు నిబంధనలను పాటించకుండా.. హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ కౌన్సిల్‌‌ నుంచి అనుమతులు రాకముందే నగరమంతటా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌‌ ఏర్పాటుచేసి హదావుడి చేస్తున్నారు. ఇంకా అప్రూవల్ రాకముందే ఓయూ అనుబంధ కాలేజీలంటూ అడ్మిషన్లు కూడా మొదలుపెట్టేశారు. మూడు నెలల నుంచి ఈ తంతు నడుస్తున్నా.. అటు ఓయూ అధికారులుగానీ ఇటు కౌన్సిల్ ఆఫీసర్లుగానీ పట్టించుకోలేదు. ఇటీవల సీపీ సజ్జనర్‌‌కు ఓయూ అధికారులు లేఖ రాశారు.


ఇప్పటికే 10 కాలేజీల కొనుగోలు


ఏపీలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు నడుపుతున్న సదరు మాజీ ఎమ్మెల్యే.. తెలంగాణలోనూ పాగా వేసేందుకు ప్లాన్‌‌ చేశారు. కొత్త కాలేజీలకు పర్మిషన్లు దొరకడం కష్టమని భావించి, నగరంలోని పాత కాలేజీలపై కన్నేశారు. రాష్ట్రంలోని 10 ప్రైవేట్‌‌ డిగ్రీ కాలేజీలను ఇప్పటికే కొనుగోలు చేసిన ఆయన.. వాటిని తన సొంత బ్రాండ్ ‘ఆదిత్య’ పేరుకు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కేవలం పేర్లు మార్చడమే కాకుండా, ఇతర జిల్లాల్లో కొన్న కాలేజీలను నగరానికి తరలించేందుకు కౌన్సిల్‌‌కు ప్రతిపాదనలు పెట్టారు. అయితే, ఈ ప్రతిపాదనలు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. ఏపీలో సొసైటీ ఉండడంతో ఇక్కడ అనుమతులు ఇవ్వాలా లేదా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే, కౌన్సిల్ నుంచి, సర్కారు నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా.. ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం రూల్స్ ఏవీ పట్టించుకోకుండా అడ్మిషన్ల వేట మొదలుపెట్టారు.
నాన్ దోస్త్ తో దోపిడీకే స్కెచ్!
సదరు విద్యాసంస్థల యజమాని ఈ కాలేజీలను నాన్ దోస్త్ కేటగిరీలో చేర్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ‘దోస్త్’ పరిధిలో ఉంటే ప్రభుత్వ ఫీజులు, పారదర్శకమైన అడ్మిషన్లు ఉంటాయి. అదే ‘నాన్ దోస్త్’ అయితే అడ్మిషన్ల ప్రక్రియ మేనేజ్‌‌మెంట్ చేతుల్లో ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయల డొనేషన్లు, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయవచ్చనేది ఈ మాజీ ఎమ్మెల్యే ప్లాన్. తెలంగాణ విద్యార్థుల సొమ్మును టార్గెట్ చేస్తూ.. కేవలం బిజినెస్ యాంగిల్‌‌లో కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఆఫీసర్ల మౌనం..


నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మూడు నెలల నుంచే ఆదిత్య పేరుతో భారీ హోర్డింగ్స్ వెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా కాలేజీలు తెరిచిన వారి నుంచి స్పందన కరువైంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ అక్రమ అడ్మిషన్ల దందా బాహాటంగా సాగుతున్నా.. వర్సిటీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. సదరు వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కావడంతో పాటు, రాజకీయ పలుకుబడి ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ తరహాలోనే డిగ్రీని కూడా ఆంధ్రా కార్పొరేట్ శక్తుల చేతుల్లోలోకి నెట్టేస్తున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ అడ్మిషన్లను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఇటీవలే ఓయూ అధికారులు.. సీపీ సజ్జనర్‌‌కు లేఖ రాశారు. ఓయూ అనుమతి లేకున్నా.. తమ పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేయడం గమనార్హం.