రైతులకు తిప్పలు రానీయొద్దు..నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

రైతులకు తిప్పలు రానీయొద్దు..నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి తిప్పలు రానీయొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని వడ్ల కొనుగోళ్లపై సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సివిల్ సప్లై అధికారులు, తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు ధాన్యం పోటెత్తుతోందని, అడుగు పెట్టేందుకు కూడా సందు లేని పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదు బృందాలకు అదనంగా మరిన్ని కాంటాలను ఏర్పాటు చేసి తూకాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రవాణా కోసం లారీల కొరత రాకుండా ప్రతి జిల్లాకు రవాణా శాఖ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని డీటీసీలకు సూచించారు. శనిగరం వంటి ప్రాంతాల్లో లారీలు సరిపోకపోతే ట్రాక్టర్లను వినియోగించుకోవాలన్నారు.

ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలోని ఐదుగురు సభ్యుల కమిటీ, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే తనకు రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు.