పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారా.. ?

పిల్లలకు బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారా.. ?

ఎనిమిదో తరగతి గది. స్టూడెంట్స్​ కొత్త బయాలజీ టీచర్​ కోసం ఎదురుచూస్తున్నారు. పాత టీచర్​ ట్రాన్స్​ఫర్​ అయి చాలా రోజులైంది. ఇంతలో కొత్త బయాలజీ టీచర్​ రానే వచ్చింది. పిల్లలంతా లేచి ‘గుడ్ మార్నింగ్ మేడం’ అన్నారు. టీచర్​ చిరునవ్వుతో ‘కూర్చోండి పిల్లలు’ అంది. పిల్లలంతా కూర్చున్నారు. 

పిల్లలంతా టీచర్​నే గమనిస్తున్నారు. ఆమెను చూస్తుంటే అందరికీ పాత టీచరే గుర్తుకొచ్చింది. ఆమె పిల్లలతో చాలా బాగా ఉండేది. ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచేది. చదువులో వెనకపడితే ఇంటికి పిలిచి, మరీ అర్థమయ్యేలా పాఠాలు చెప్పేది. 

క్లాస్​ రూమ్​ని పరిశీలిస్తూ “స్టూడెంట్స్​.. నా పేరు సుహాసిని. నేను మీ బయాలజీ టీచర్​ను. మీరంతా మీ పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి. అలాగే పెద్దయ్యాక జీవితంలో ఏమవ్వాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి” అంది.

క్లాస్​లో ఎప్పుడూ చురుగ్గా ఉండే రజిత లేచి నిలబడింది. ఆమె ఎత్తులో పొడుగ్గా ఉన్నా, చదువు మీద ఆసక్తితో మొదటి బెంచీలో గోడవైపు కూర్చుంటుంది. “నా పేరు రజిత. నేను డాక్టర్​ కావాలనుకుంటున్నా” అంది. స్టూడెంట్స్​ అందరూ రజిత వైపు చూశారు. సుహాసిని టీచర్​ కూడా తదేకంగా ఆ అమ్మాయినే చూసింది. 

“వెరీగుడ్, నెక్స్ట్” అంది మేడం.

“నా పేరు చందు. నేను పెద్దయ్యాక లాయర్​ కావాలనుకుంటున్నా మేడమ్.”

“నా పేరు లావణ్య. నేను టీచర్​ను కావాలనుకుంటున్నా” అని... క్లాస్​లో స్టూడెంట్స్​ అందరూ ఒక్కొక్కరుగా చెప్తుంటే, మిగతావాళ్లంతా ఆసక్తిగా వింటున్నారు. ఆ క్లాస్​లో అబ్బాయిలున్నా, అన్నింటా పైచేయి అమ్మాయిలదే. 

‘‘స్కూల్​ మారుమూల ప్రాంతంలో ఉన్నా.. పిల్లలకు భవిష్యత్తుపై ఒక క్లారిటీ ఉంది” అనుకుంది సుభాషిణి.

స్టూడెంట్స్​ చెప్పడం పూర్తయింది. అయినా సుహాసిని రజితనే పరీక్షగా చూస్తూ ఆలోచనలో పడింది. ఆమె ఆలోచనల్లో ఉండగానే, “టీచర్.. చిన్నప్పుడు మీరేం కావాలనుకున్నారు?” రజిత ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చింది సుహాసిని. 

“నేను చిన్నప్పుడు టీచర్​ కావాలనే అనుకున్నా. అలానే అయ్యా. మీరు కూడా మీ లక్ష్యాన్ని సంకల్పంగా మార్చుకోవాలి. అర్ధమైందా?” అని పాఠం మొదలు పెట్టింది. ‘‘మొక్కలకు కూడా స్పర్శ ఉంటుంది తెలుసా?’’ అని ఆమె అనగానే పిల్లలంతా ఆశ్చర్యంగా చూశారు. 

‘‘మొక్కల్లో ‘షేం ప్లాంట్స్’ అదే అత్తిపత్తి అనేవి ఉంటాయి. వాటికి ఇతరులు ముట్టుకోవడం అసలు ఇష్టముండదు” అని బోర్డు మీద బొమ్మ వేసి, తన బ్యాగులో నుండి ఆ చెట్టు తీసి చూపించింది. దానిని అందరికీ ఇచ్చి, వివరించింది. అంతలో గంట మోగింది. తరగతి బయటకు నడిచింది సుహాసిని టీచర్​. పాఠం ఆసక్తిగా ఉండడంతో, అప్పుడే బెల్​ మోగిందే అని నిరాశగా పుస్తకాలు మూసేశారు పిల్లలు. లంచ్​ టైం వరకు వాళ్ళ ఆలోచనలన్నీ బయాలజీ మేడం చూపించిన ఆ చెట్టు మీదే ఉన్నాయి. 

*   *   *
లంచ్​ టైంలో పిల్లలంతా వేప చెట్లకింద కూర్చుని అన్నం తింటున్నారు. వాళ్లు మిగిల్చిన అన్నం కోసం కాకులు, గద్దలు, కుక్కలు, కోతులు పక్కనే ఉన్న ప్రహరీ  మీద కాచుకొని ఉన్నాయి. 

“ఇక్కడికి రా చందన్నయ్యా.. ఇక్కడ చెట్టు నీడ చాలా ఉంది”  అని పిలిచింది రజిత. ఇద్దరూ ఒకే తరగతి. దూరపు బంధువులు. వరసకు అన్నా చెల్లెళ్ళు అవుతారు.

“రజితా.. బయాలజీ మేడం చాలా బాగా చెప్తుంది కదా?” అంటూ రజిత దగ్గరికి వచ్చి కూర్చున్నాడు చందు. 

“అవును అన్నయ్యా, నాకు బయాలజీ అంటే చాలా ఇష్టమని నీకు తెలుసుకదా” అన్నది రజిత. 

“అవును, బయాలజీ అంటే నీకంత ఇష్టం ఎందుకు రజితా?” అన్నాడు చందు.

“నాన్నకు సరైన వైద్యం అందక నా చిన్నప్పుడే చనిపోయాడు. పెద్దయ్యాక నేను డాక్టరునవుతా. నాలాంటి పేదవాళ్ళకు పైసా తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేస్తా అన్నయ్యా..” రజిత గొంతు బొంగురుపోయింది. ఆమె కళ్ళల్లో నీటి పొర వానాకాలం చెరువులా నిండుగా కనిపించింది. అది చూసి, “అవుతావులే రజిత... అన్నం తిను ముందు. బెల్లు కొడతారు. ఆడుకుందాం” అంటూ మాట మార్చాడు. 
మధ్యాహ్న భోజనం పెట్టించి, తన రూమ్​కు వెళ్తున్న హెడ్ మాస్టర్ చెవిలో ఆ పిల్లల మాటలు పడ్డాయి. “చిన్న వయసులో పెద్దరికాన్ని పేదరికమే నేర్పుతుంది” అనుకున్నాడు.

గబగబా అన్నం తిని పళ్ళెం కడగడానికి లేచిన చందుతో, రజిత “నువ్వెళ్ళు నే వస్తాలే అన్నయ్యా” అంది.

ఆటల మోజులో ఉన్న చందూ, ‘సరే’ అంటూ వెళ్లిపోయాడు. రజిత గబగబా అన్నం తిని క్లాస్​ రూమ్​ లోకి వెళ్లి, తన బెంచీ మీద కూర్చొని మ్యాథ్స్​ పుస్తకాలు తీసి, పాఠాలు చదువుకుంటూ కూర్చుంది. ఆడుకునేందుకు రమ్మని చందు పిలిస్తే కూడా వెళ్లలేదు.

ఈలోపు ఆరో తరగతి అమ్మాయి వచ్చి, “రజితక్కా.. నిన్ను బయాలజీ మేడం పిలుస్తోంది” అని చెప్పగానే, ఆశ్చర్యంగా ‘‘ఎందుకూ ..?” అని అడిగింది.

 “ఏమో? నాకు తెలియదు.. కానీ త్వరగా రమ్మంటోంది’’ అని చెప్పి, ఆడుకునేందుకు గ్రౌండ్​ వైపు తుర్రుమంది. చందు కోసం చూస్తే గ్రౌండ్​లో ఎక్కడా లేడు. స్టాఫ్ రూమ్ కు ఒంటరిగా వెళ్ళాలంటే భయం అనిపించింది.  అసలే కొత్త టీచర్లు. వాళ్ళంతా అక్కడే ఉంటారు. భయంభయంగా అక్కడికి వెళ్ళింది రజిత. గుమ్మం దగ్గర ఆగి, “లోనికి రావచ్చా మేడమ్..” అని అడిగింది. బయాలజీ మేడం నవ్వుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి, రజిత భుజం మీద చేయి వేసి హత్తుకుని, “ఈ అమ్మాయి, అచ్చం మా అన్నయ్య కూతురిలా ఉంది మేడమ్​” అని అక్కడి టీచర్లకు చెప్తూ పర్సులో నుండి ఫొటో తీసి చూపెట్టింది. 
“నిజమే ఆ అమ్మాయి అచ్చం నాలాగే ఉంది. సినిమాలో చూపినట్టు” మనసులో అనుకుంది రజిత. తనతో బాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి రజిత, సుహాసిని మేడం మానసికంగా బంధువులయ్యారు. రజితపై మేడంకు ప్రత్యేక ఆసక్తి, బయాలజీ అంటే రజితకు ఇష్టం పెరిగాయి.
*   *   *
వరుసగా ఐదురోజులుగా బడికి రాలేదు రజిత. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. “రజిత బడికి ఎందుకు రావడం లేదు? ఏమైంది చందు?” బయాలజీ మేడం అడిగింది. 

“నాకు తెలియదు మేడమ్​. వాళ్ళు మాకు చుట్టాలే. కానీ, మా అమ్మ వాళ్ళింటికి పోవద్దని చెప్తుంటుంది. ఈరోజు సాయంత్రం వాళ్ళింటికి పోయి, అడుగుతా” అన్నాడు చందు. 

ఆలోచనల్లో పడింది సుహాసిని. ‘‘రజిత చాలా చురుకైన అమ్మాయి. జ్వరం వచ్చినా స్కూల్​కు వస్తుంది.  అలాంటిది ఎందుకు రాలేదు?’’ అనుకుని, విషయం కనుక్కోమని మరోసారి చందుకు చెప్పింది. సాయంత్రం రజిత ఇంటికెళ్లిన చందు గుమ్మం బయట నిలబడి “రజిత.. ఓ.. రజితా” అంటూ గట్టిగా పిలిచాడు. చాలాసేపటి తరువాత లోపలనుండి వాళ్ళమ్మ తలుపు తీసుకొని బయటకొచ్చింది. “ఏంది చందు?” అనడిగింది. 

‘‘రజిత స్కూలుకు రావడం లేదు. ఏమైందో కనుక్కుని రమ్మంది బయాలజీ టీచర్​” అని చెప్పాడు చందు. 

“రజితకు ఒంట్లో బాగాలేదు, నాలుగు రోజులయ్యాక వస్తుందని చెప్పు” అంది. “ఏమైంది చిన్నమ్మా ” అని చందు అడిగితే బదులియ్యలేదు. లోపలికి పోయి గట్టిగా తలుపేసుకుంది. 

రజిత ఇల్లు ఊరికి దూరంగా,  బైపాస్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. రజిత వాళ్ళ అమ్మ అక్కడ ఒక చిన్న టీ కొట్టు నడుపుతుంది.

పదిహేను రోజుల తర్వాత రజిత బడికి వచ్చింది. ముఖంలో కొత్త కళ కనిపిస్తోంది. ముందటిలా గబగబా మాట్లాడడం లేదు. బయాలజీ మేడం అర్థం చేసుకుంది. మరుసటి రోజు రజితకు కొన్ని స్వీట్స్​ ఇచ్చింది. రజిత వాటిని చాలా ఇష్టంగా తిని, టీచర్​కు ‘థ్యాంక్స్​’ చెప్పింది. రజిత శరీరంలో, మాటలో మార్పులు వచ్చాయి. ఆ అమ్మాయికి అత్తిపత్తి చెట్టు ఎందుకలా ముడుచుకుంటుందో మెల్లగా అర్థం కాసాగింది.
*   *   *
మధ్యాహ్నం రెండో పీరియడ్. టీచర్​ సెలవు పెట్టడంతో, క్లాస్​ బాధ్యత లీడర్ తీసుకుంది. పరీక్షలు దగ్గర పడడంతో స్టూడెంట్స్​ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. స్కూల్​కి పెద్ద వ్యాన్​ రావడం కిటికీలోనుంచి పిల్లలకు కనిపించింది. దాంతో చదవడం ఆపి అటే చూశారు. అందులో నుండి తెల్లకోటుతో నలుగురు ఆడవాళ్లు కిందకు దిగారు. రజితకి ఆసక్తి పెరిగింది. ఆ డ్రెస్ అంటే తనకు ప్రాణం. టీచర్​ దగ్గర దిద్దిన నోట్స్​ తీసుకొస్తానని చెప్పి బయటకెళ్ళిన చందు పరిగెత్తుకుంటూ క్లాస్​రూమ్​లోకి వచ్చాడు.

‘‘ఆ డాక్టర్లు మనతో మాట్లాడడానికి వచ్చారట” అని చెప్పాడు. 

“నట్టల మందు ఇస్తారేమో” అన్న రజిత మాటకు, “కాదు కాదు. మనకేవో ముఖ్యమైన విషయాలు చెప్తారట. బయాలజీ మేడం చెప్పింది” అన్నాడు.

పెద్ద హాలులో పిల్లలందరినీ కూర్చోపెట్టారు. వచ్చిన వాళ్లందరినీ డయాస్​ మీదికి పిలిచింది బయాలజీ మేడం. తర్వాత పెద్ద డాక్టర్​ మేడం స్పీచ్​ మొదలుపెట్టింది. ముందు వరుసలో కూర్చున్న రజిత శ్రద్ధగా వింటోంది. “అందరికీ నమస్కారం.. నేనొక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్తారా?”. “మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే అర్థం తెలుసా?” పిల్లల వైపు నుంచి నిశ్శబ్దం. “పిల్లల శరీరాన్ని వాళ్ల అనుమతి లేకుండా ఇతరులు తాకకూడదు. మన శరీరంలో కొన్ని చోట్ల ఇతరులు తడమడం చట్టరీత్యా నేరం... అని చెప్తూనే  దగ్గరి బంధువులు, కొత్తవాళ్లు మన శరీరంలో తాకకూడని చోట్లు ఇవి” అని చార్టును జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూపిస్తూ వివరించింది. ఆ శరీర భాగాలను తాకడం వలన కలిగే బాధను లోతుగా చెప్పింది. 

రోజూ సీతాకోక చిలుకలతో ఆడే పిల్లలంతా, వాటి రెక్కలను తాకినప్పుడు, అవి పొందే బాధను వాళ్లు ఎక్స్​పీరియెన్స్​ చేశారు. ఇకపై వాటిని బాధ పెట్టకూడదని అనుకున్నారు. డాక్టర్​ మేడం స్పీచ్​ పూర్తయింది. తరువాత మరొకరు మైకు అందుకున్నారు. “స్టూడెంట్స్..  మన బాడీలో తాకకూడని చోట్లలో తాకినపుడు, మీకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. దాని పేరే పోక్సో చట్టం” అని చెప్పారు. కొత్త విషయాలు చెబుతున్న వక్తల మాటలు వింటుంటే.. రజితకు ఎన్నో డౌట్స్ వచ్చాయి. కానీ అంతమందిలో అడగడానికి ఇష్టపడలేదు. బ్యాడ్ టచ్. అవును... బ్యాడ్ టచ్... అది తనకు బాగా తెలుసు. కానీ ఎలా చెప్పాలి...? అమ్మ ఏనాడు నాకు దీని గురించి చెప్పలేదేం. ప్రోగ్రామ్​ ముగిసింది. డాక్టర్లను ఒంటరిగా కలుసుకునే అవకాశం ఇచ్చారు. అయినా రజితకు కొత్త వాళ్ల దగ్గరకు వెళ్ళాలి అనిపించలేదు. ఇంటి గంట మోగడంతో పిల్లలంతా పుస్తకాలు తీసుకొని ఇంటికి హడావిడిగా బయల్దేరారు. రజిత బుర్రలో బోలెడు అనుమానాలను మోసుకుంటూ ఇంటికెళ్లింది. రోజూ పుస్తకాలు బరువు అనిపించేవి. కానీ ఆ రోజు ఎడతెగని ఆలోచనలతో మనసు బరువెక్కింది.
*   *   *
ఇంటిముందు లారీ వచ్చి ఆగింది. “రజితా... అమ్మ ఏంజేస్తోంది?” చనువుగా అడిగాడు నారాయణ బాబాయి. అప్పుడప్పుడు ఇంటికొస్తాడు. అమ్మ అతన్ని ‘బాబాయి’ని పిలవమంటే, చిన్నప్పటి నుండి అలాగే పిలుస్తోంది. బాబాయి ఎప్పుడొచ్చినా తమ్ముడికి తనకు కొత్త బట్టలు, తినడానికి శ్నాక్స్​ తీసుకొస్తాడు. చాలా రోజులైంది బాబాయిని చూసి. ఈమధ్య రావడం లేదు. “లోపల ఉంది బాబాయి” అన్నది. తలుపేసి ఉండడంతో బయట మంచం మీదే కూర్చున్నాడు. ఈలోగా తలుపు తెరుచుకుంది. “ఇదిగో ..” అని అమ్మను పిలిచాడు. అమ్మ లోపల నుండి గబగబా వచ్చింది. ఆమె ముఖంలో పొయ్యి దగ్గర కూర్చున్నట్టు, చెమటలు, అలసట బాగా కనపడుతోంది.

రాములు బాబాయి జేబులో నుండి తీసిన కొన్ని ఐదువందల నోట్లు అమ్మ చేతిలో పెట్టాడు. రాములు బాబాయి ముఖంలో గర్వం, అమ్మ మొఖంలో ఆనందం కనబడింది. నారాయణ బాబాయి వైపు తిరిగి మీసాలు దువ్వుకుంట అక్కడి నుంచి కదిలాడు. మంచం మీద నుంచి విసురుగా లేచిన నారాయణ బాబాయి లారీ దగ్గరకు పోయి వెంటనే తిరిగొచ్చాడు. అతని చేతిలో  మందు బాటిల్​ ఉంది. వెంటనే తలుపులు మూసుకున్నాయి.

ఈలోగా వచ్చిన వాళ్లకు టీ అమ్ముతూ, అన్నం వండేసింది రజిత. వాళ్ళంతా చిన్నప్పటి నుండి చూస్తున్నవాళ్ళే. ఆ తలుపు అలా మూసుకోవడం, తెరుచుకోవడం రజితకు అలవాటైపోయింది.

రాత్రి అన్నంలోకి అమ్మ కోడికూర వండింది. తమ్ముడు కూర ఉడికేంతవరకు ఆకలికి ఆగలేక పచ్చడి మెతుకులు తిని పడుకున్నాడు. వాళ్ళతో పాటు అన్నం తిని ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు నారాయణ బాబాయి. తెల్లారింది. ఆరోజు ఆదివారం. స్నానం చేసొచ్చిన బాబాయికి, అమ్మకు ఏదో గొడవ మొదలైంది. రజితకు ఆ గొడవేంటో అర్థం కాలేదు. రజిత పగలంతా టీ స్టాల్ చూసుకుంది. నారాయణ బాబాయి వచ్చిన దగ్గర నుంచి అమ్మ సరిగ్గా బయటకు రావడంలేదు. బాటిల్​లో మందు అయిపోతే, ఇంకోటి తెచ్చుకున్నాడు. రాత్రయింది. తాగడం మొదలుపెట్టాడు. మళ్ళీ బాబాయికి, అమ్మకు మధ్య గొడవ మొదలైంది. 

చాలా సేపటికి గొడవ సద్దుమణిగింది. రజితకు నిద్రపట్టలేదు. అటు దొర్లి ఇటు దొర్లి నిద్రలోకి జారుకుంది. చటుక్కున మెలకువ వచ్చింది. వంటిపై ఏమో పారుతున్నాయి. కాసేపటికి గ్రహించింది. తన మీద పడ్డ చేతులను గట్టిగా విదిల్చింది. అవి మరింత గట్టిగా బిగుసుకున్నాయి. స్కూల్​లో డాక్టర్​ చెప్పిన బ్యాడ్ టచ్. “అమ్మా! అని గట్టిగా అరిచింది”. అప్పటికే అమ్మ నోరు డబ్బు, మందుతో కట్టేసి ఉంది. ఊరికి దూరంగా ఉన్న ఆ ఇంట్లో రజిత ఆర్తనాదాలు అరణ్య రోదన అయ్యాయి. మనసును కమ్మిన చీకటి కాసేపటికి  మనిషిని కమ్మింది. తెల్లారేసరికి మత్తుదిగిన అమ్మ మొఖంలో బాధలేదు. రజితలో నిర్వేదం కమ్మింది. నిరాశగా స్కూల్​కి వెళ్లింది.
*   *   *
బడిలో రజిత నిస్తేజంగా ఉంటోంది.

 “ఏమైంది రజితా అలా పరాకుగా ఉన్నావు” చందు మాటకు బదులియ్యలేదు. అడిగితే చిరాకు పడింది. లంచ్​ చేయలేదు. అన్నం చెత్త కుండీలో పడేసింది. క్లాస్​లో పాఠాలు వినడం లేదు. డాక్టర్​ మేడమ్​ చెప్పిన బ్యాడ్ టచ్ చెవుల్లో గింగిరాలు కొడుతోంది. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. బయాలజీ టీచర్​ క్లాస్​కి వచ్చింది. ఎంతో శ్రద్ధగా పాఠాలు వినే రజిత ఈ లోకంలో లేనట్టు ఉండడాన్ని గమనించింది.
క్లాసు పూర్తయ్యాక రజితను స్టాఫ్ రూమ్​కు తీసుకుపోయింది. మెల్లగా అడిగింది. రజిత ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. తల్లి అదే బ్యాడ్ టచ్​ను కొనసాగించమని బలవంతపెడుతున్నట్టు చెప్పింది. టీచర్​కు విషయమంతా అర్థమైంది. వెంటనే పోలీసులను కలిసింది. వాళ్లు నారాయణను, రజిత తల్లిని కస్టడీలోకి తీసుకున్నారు. రజితని హోంకి అప్పగించారు. 

‘‘అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు’’ అన్నట్టు నారాయణ కాళ్ళ బేరానికి వచ్చాడు. డబ్బుతో ఆడపిల్ల శీలానికి ధర కట్టే ప్రయత్నం చేశాడు. బయాలజీ మేడమ్​ వెనక్కి తగ్గలేదు. మైనారిటీ తీరని పిల్లలపై లైంగిక వేధింపులు చేసినందుకు కోర్టు అతనికి పోక్సో చట్టం కింద జీవితకాలం శిక్ష వేసింది. బిడ్డల మొఖం చూసి.. కనికరించమని రజిత తల్లి సానుభూతి నాటకం ఆడింది. నాటకం కదా... ఎవరూ కరగలేదు. ఆమె మాటలు నమ్మలేదు. దాంతో రజిత తల్లి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. సుహాసిని మేడం రజిత తమ్ముడిని దత్తత తీసుకుంది. 

ఫోన్​ : 9885838288