బిడ్డ కోసం బొమ్మకు చికిత్స.. అమ్మ ఆలోచనకు హ్యాట్సాఫ్

బిడ్డ కోసం బొమ్మకు చికిత్స.. అమ్మ ఆలోచనకు హ్యాట్సాఫ్

తల్లీ బిడ్డల  ప్రేమకు  మించినది  ఏదీ  ఉండదు.  పిల్లల  గురించి  తల్లికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పిల్లలకు ఏమి ఇష్టమో.. వారికి కష్టమొస్తే ఎలా బుజ్జగించాలో కూడా ఆ తల్లికే తెలుసు. ఢిల్లీలో ఓ తల్లి అదే పని చేసింది. కాలు విరిగి ఇబ్బంది పడుతున్న తన కూతురికి తన ఆలోచనతో ట్రీట్మెంట్ చేయించింది.

ఢిల్లీకి చెందిన ఓ 11 నెలల పాప కాలు ఎముక ఫ్రాక్చర్ అయి ఇబ్బంది పడుతోంది. కానీ పసిపాప కావడంతో ట్రీట్మెంట్ కు సహకరించడం లేదు. ఏం చేయాలని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. డాక్టర్లు కూడా ఆ చిన్నారికి ట్రీట్మెంట్ చేసేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డ కష్టాన్ని ఎలా తొలగించాలని ఆ తల్లి బాగా ఆలోచించింది.

చివరంగా  ఆ తల్లికి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన కూతురు బాగా ఇష్టపడే ఓ బొమ్మ ఉందని.. ముందు దానికి ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్లకు చెప్పింది. డాక్టర్లు కూడా మొదట ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు. కానీ ఆ తల్లి మనసు అర్థం చేసుకుని ఓకే చెప్పారు. హాస్పిటల్ లో చిన్నారి ఉన్న బెడ్ పైనే బొమ్మకు ఉత్తుత్తి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. బొమ్మ రెండు కాళ్లకు బ్యాండేజీ వేసి.. పైకి కట్టారు. ఇదంతా ఆ చిన్నారి గమనిస్తూనే ఉంది. బొమ్మ ట్రీట్మెంట్ అయిపోగానే.. చిన్నారి కి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. అప్పటి వరకు ఏడ్చి.. మారాం చేసిన ఆ చిన్నారి.. పక్కన బొమ్మకు చేసినట్టుగానే తనకు చేస్తుండటంతో సైలెంట్ గా ఉండిపోయింది. ఒక రోజు రెండు రోజులు కాదు.. ఇప్పటికీ వారం రోజులు దాటింది. కాళ్లు పైకి కట్టేసినా ఏ మాత్రం ఏడవకుండా ట్రీట్మెంట్ కు సహకరిస్తోంది. పక్కనే తనలాగే కాళ్లకు బ్యాండేజీతో ఉన్న బొమ్మతో ఆడుకుంటోంది. మరో వారం రోజుల్లో చిన్నారి పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నారికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియక మొదట తల పట్టుకున్న డాక్టర్లు ఆ తల్లికి వచ్చిన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. డాక్టర్లైన తమకే అలాంటి ఆలోచన రాలేదని.. కానీ ఓ మధ్య తరగతి మహిళ అయినా.. ఆ పాప తల్లికి ఇలా ట్రీట్మెంట్ చేయాలనే ఆలోచన రావడం చాలా గ్రేట్ అంటున్నారు.