దోమలగూడ మిస్సింగ్ ముగ్గురు బాలికలు సేఫ్..ఛత్తీస్ గఢ్లోని స్వగృహంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

దోమలగూడ మిస్సింగ్ ముగ్గురు బాలికలు సేఫ్..ఛత్తీస్ గఢ్లోని స్వగృహంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​​దోమలగూడ  నుంచి మిస్సింగ్  అయిన ముగ్గురు బాలికలు సేఫ్ గా ఉన్నారు. సికింద్రాబాద్  జోన్  డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆదివారం గాంధీనగర్  ఏసీపీ ఆఫీస్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉపాధి కోసం ఛత్తీస్‌‌గఢ్ కు చెందిన రామదులారి ఫ్యామిలీ ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్​కు వలస వచ్చి దోమలగూడ బస్తీలో నివసిస్తోంది. ఈ నెల19న సనీషా కుమారి(శిల్ప)(17), స్నేహ కుమారి(16),  రోహితిన్  కూతురు లత(15) ఇంటి నుంచి అదృశ్యమయ్యారు.

 కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో సీసీ పుటేజీ ఆధారంగా గాలింపు మమ్మురం చేశారు. 262 సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు ఛత్తీస్​గఢ్​ పోలీసుల సహకారంతో వారిని గుర్తించారు. 19న హిమాయత్ నగర్  మెయిన్  రోడ్డులో కుల్ఫీ స్పాట్  వద్ద ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. 

అక్కడి నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్  స్టేషన్ కు వెళ్లి దానాపూర్  ఎక్స్ ప్రెస్  ట్రైన్  ఎక్కి నాగ్ పూర్ కు చేరుకున్నారు. ఆ రాత్రి స్టేషన్ లోనే ఉన్న వారు 21న ఉదయం 6 గంటలకు బస్సులో గడ్చిరోలి మీదుగా పాతంజుర్  గ్రామానికి వెళ్లి అక్కడ బిశ్వజిత్  అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజులు ఉన్నారు. 

ఛత్తీస్‌‌గఢ్  పోలీసుల సహకారంతో ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల గొడవల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు బాలికలు తెలిపారు. సఖి భరోసా సెంటర్​లో వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్  నిర్వహించి పూర్తి విచారణ అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని డీసీపీ తెలిపారు. అడిషనల్  డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, ఇన్​స్పెక్టర్  అంజద్  అలీ ఉన్నారు.