హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటామని, ఈ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ సీవీ ఆనంద్ సహా నటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ డ్రగ్స్‌కు బానిస కాకూడదని, డ్రగ్స్ అమ్మకాలకు, సరఫరాకు తావుండకూడదన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
సమాజాన్ని ప్రభావితం చేయగల నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు, ప్రముఖులు ‘సే నో టు డ్రగ్స్’పై వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు. డ్రగ్స్ కట్టడికి సంబంధించి ఈగల్ ఫోర్స్‌కు ఫుల్ పవర్స్ ఇచ్చామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేది యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక శాపమన్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజమంతా కలిసి పోరాడాల్సిన యుద్ధమని పేర్కొన్నారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, జీవితంలో లక్ష్యాలను సాధించడమే నిజమైన విజయం అని సినీ నటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. స్ట్రెస్ సహా ఇతర కారణాల వల్ల డ్రగ్స్‌కు బానిసై జీవితాలను బలి చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, జిమ్నాస్టిక్ క్రీడాకారిణి బుద్దా అరుణ రెడ్డి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
