డిగ్రీ దోస్త్ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో ..53,967 మందికి సీట్లు క్రేజ్ తగ్గని బీకామ్.. 

డిగ్రీ దోస్త్ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో ..53,967 మందికి సీట్లు క్రేజ్ తగ్గని బీకామ్.. 
  • రెండో స్థానంలో ఫిజికల్ సైన్స్
  • మొత్తంగా డిగ్రీలో 1,73,120 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విడతలో మొత్తం 53,967 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఈ మేరకు టీజీసీహెచ్‌‌‌‌ఈ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. దోస్త్ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో మొత్తం 57,690 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా, అందులో 44,179 మందికి మొదటి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు దక్కాయి.

అయితే, తక్కువ ఆప్షన్లు ఇచ్చుకున్న 3,723 మందికి సీటు అలాట్ కాలేదు. కోర్సులవారీగా చూస్తే విద్యార్థులు ఈసారి కూడా అత్యధికంగా బీకాం వైపు మొగ్గు చూపారు. స్పెషల్ ఫేజ్‌‌‌‌లో కేటాయించిన సీట్లలో బీకామ్‌‌‌‌లో 17,335 మంది, బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో 10,894 మంది, బీఎస్సీ (లైఫ్ సైన్స్)లో 9,592 మంది, బీఏలో 9,073 మంది, బీబీఏలో 4,411 మంది, బీసీఏలో 1,734 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

మొత్తంగా 1.73 లక్షల మందికి.. 

రాష్ట్రవ్యాప్తంగా 783 కాలేజీల్లో మొత్తం 3,73,149 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు అన్ని విడతలు కలిపి 1,15,433 మంది విద్యార్థులు తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకున్నారు. వీటితోపాటు కొత్తగా స్పెషల్ ఫేజ్‌‌‌‌లో 57,690 మందికి సీట్లు అలాట్ అయ్యాయి.

ఈ రెండూ కలిపితే మొత్తం 1,73,120 మందికి సీట్లు లభించినట్లయింది. అయితే, కొత్తగా స్పెషల్ ఫేజ్‌‌‌‌లో సీట్లు పొందిన వారిలో 583 ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కాలేజీల్లో 25,586 మందికి, 36 సర్కారు అటానమస్ కాలేజీల్లో 11,852 మందికి, 116 సర్కారు కాలేజీల్లో 9,617 మందికి, రెండు యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లో 1,183 సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అలాగే సంబంధిత కాలేజీలకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.