బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ

బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ
  •    డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని లాస్యనందిత రూ.1.46కోట్లు వసూలు 
  •     ఆమె మృతి తర్వాత కుటుంబ సభ్యులు స్పందించడంలేదు
  •     ఇంటి ముందు బైఠాయించి బాధితుల ఆందోళన  

కంటోన్మెంట్, వెలుగు:  ఉప ఎన్నిక సమీపిస్తుండగా.. కంటోన్మెంట్ బీఆర్ఎస్​అభ్యర్థి నివేదితకు డబుల్​బెడ్రూమ్ ఇండ్ల బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. డబుల్​ ఇండ్లు ఇప్పిస్తామని  దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత రూ. కోట్లలో తీసుకుని మోసం చేసిందని బాధితులు, బీఆర్ఎస్ స్థానిక నేతలు ఆరోపించారు. శనివారం లాస్యనందిత సోదరి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి ముందు బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. డబ్బులు ఇచ్చినా తమకు ఇండ్లు ఇవ్వలేదంటూ బాధితులు వాపోయారు.  ఊహించని నిరసనతో నివేదితపై ఉప ఎన్నికలలో తీవ్ర ఎఫెక్ట్ పడనుంది. 

రూ.1.46 కోట్లు వసూలు 

కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న హయాం లో ఆయన కూతురు దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత తమ నుంచి రూ.1.46 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని 30 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని బీఆర్ఎస్​ నేత సదానంద్​గౌడ్​ ఆరోపించారు. 

గత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక ఇండ్లు ఇస్తామని అప్పట్లో లాస్య నందిత తమకు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇండ్లు ఇవ్వలేదని, తమకు డబ్బులైనా ఇవ్వాలని కోరగా ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. చివరకు ఇండ్ల కోసం ఒత్తిడి చేయగా గతేడాది రూ.12 లక్షలు తిరిగి ఇచ్చారని, లాస్య నందిత మృతి తర్వాత కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని చెప్పారు. మిగతా రూ.1.34 కోటి ఇవ్వాలని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు, అప్పుడూ అంటూ దాటవేస్తున్నారే తప్ప స్పందించడంలేదని వాపోయారు.  

దీనిపై కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్​రెడ్డి జోక్యం చేసుకుని తాను సెటిల్​చేస్తానని హామీ ఇచ్చి, ఆయన కొన్నిరోజులు తిప్పుకుని కాలయాపన చేశారని, డబ్బులు మాత్రం ఇప్పించ లేదన్నారు.  డబుల్ ఇండ్లు వస్తాయన్న ఆశతో వడ్డీలకు అప్పులు తెచ్చి రూ. లక్షల్లో ఇచ్చామన్నారు. తీరా ఇండ్లు రాకపోగా, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక  ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైరల్ గా మారిన వీడియో

డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ గత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అందులో లాస్య నందిత రూ. 5లక్షలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఇండ్లు ఇవ్వనందుకు వడ్డీతో కలిపి మొత్తం రూ.8లక్షలు ఇవ్వాలని అవతలి వ్యక్తి కోరగా, తను వడ్డీ ఎలా ఇస్తాననడంతో  లాస్యనందితకు అతనికి మధ్య జరిగిన సంభాషణ ఉంది. 

అయితే.. డబుల్​ ఇండ్లు ఇంకా ఎవరికి ఇప్పించలేదని, కొందరికి ఇచ్చి, మీకు ఇవ్వకుంటే అప్పుడు అడగాలని, అందరితో పాటు మీకు వస్తాయని అందులో ఆమె మాట్లాడారు. అప్పట్లో ఆ వీడియో వైరల్​గా మారింది. కాగా ఇప్పుడు డబుల్​ ఇండ్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  ఏకంగా బాధితులు ఆమె ఇంటి వద్ద ధర్నాకు దిగారు. దీంతో  స్థానికంగా సంచలనంగా మారింది. కాగా దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితను సంప్రదించగా ఆమె అందుబాటులో లేరు.