హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూసుకుపోతున్న హైడ్రా.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నివాసాలు కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
మే1న మాదాపూర్ సున్నం చెరువు, ఉప్పల్ రామంతాపూర్ చెరువు బాధితులతో కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చెరువుల పరిధిలో ఉన్న గుడిసెలు, నివాసితులపై పూర్తి వివరాల సేకరణ జరుగుతోందని ఆయన వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధనను విధించారు. 2024 జూలై 19వ తేదీ కంటే ముందు అక్కడ నివాసం ఉన్న వారిని మాత్రమే లబ్ధిదారులుగా పరిగణించనున్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా పారదర్శకంగా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
జీవనోపాధి కోసం నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల నుంచి వలస వచ్చిన పేదలు.. నగరంలో ఇళ్ల అద్దెలు భరించలేక ఈ చెరువుల వద్ద గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా చెత్త సేకరణ చేసే వారు, దినసరి కూలీలే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వీరి పరిస్థితిని మానవీయ కోణంలో అర్థం చేసుకున్న ప్రభుత్వం.. ఎవరూ నిరాశ్రయులు కాకుండా చూడాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలతో జాబితా తయారు చేసి, ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
