హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఓయూ ఫ్యాకల్టీ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 2026–29 కాలపరిమితికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సురేందర్ రెడ్డి నేతృత్వంలోని ప్యానెల్ వరుసగా నాలుగోసారి విజయం సాధించి, బాధ్యతలు చేపట్టడం సంఘ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బెల్లి యాదయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జె. చిన్న, ఉపాధ్యక్షుడిగా కె. తిరుపతయ్య, ఫైనాన్స్ సెక్రటరీగా ఎన్. రమేష్ గౌడ్, మహిళా కార్యదర్శిగా సీహెచ్ జ్యోత్స్న ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా పావని, కిరణ్ కుమార్, మల్టీజోన్–1 కార్యదర్శిగా యు. రవికుమార్, మల్టీజోన్–2 కార్యదర్శిగా పి. నర్సిములు ఎలెక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్కారు డిగ్రీ కళాశాలల ప్రతిష్ఠను పెంచడం, లెక్చరర్ల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పెండింగ్‌లోని సర్వీసు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
