V6 News

మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాల్సిందే : ప్రొఫెసర్‌ సల్లా సౌజన్య

మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాల్సిందే :  ప్రొఫెసర్‌ సల్లా సౌజన్య
  • పసికందుతో జంతర్‌ మంతర్‌ లో ప్రొఫెసర్‌ సల్లా సౌజన్య ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఓబీసీ మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆందోళనలో భావోద్వేగమైన క్షణం అందరి హృదయాలను ఆలోచింపజేసింది. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ సల్లా సౌజన్య తన రెండు నెలల పసికందుతో ధర్నా చేపట్టారు. ఉక్కిరిబిక్కిరి చేసే ఎర్రని ఎండలో ఓ వైపు తల్లిగా శిశువును కాపాడుకుంటూనే.. మరోవైపు సమాజంలో అణగారిన వర్గాల మహిళల హక్కుల కోసం ఆమె పోరాడారు. 

సౌజన్య మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ అందులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఫైర్ అయ్యారు. ‘అందరూ మహిళలు సమానం అన్నప్పుడు.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఎందుకు కల్పించరు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం మహిళా బిల్లులో సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తానని హెచ్చరించారు.