భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్​వాటర్​ 

భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్​వాటర్​ 

భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్​వాటర్​ కలుపుతున్నారు. వరదలు రావడంతో కరకట్ట కింద ఉన్న స్లూయిజ్ లను మూసివేశారు. దీంతో డ్రైన్​వాటర్​ అంతా రామాలయం పరిసరాలను ముంచెత్తింది. వీటిని 16 మోటార్లతో పంపింగ్​ చేసి గోదావరిలో కలిపారు. దీంతో బయోలాజికల్​ ఆక్సిజన్​ డిమాండ్​(బీవోడీ) పెరిగి జలాలు కలుషితం అయ్యాయని అంటున్నారు. భద్రాచలం వద్ద బీవోడీ 5శాతం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఎస్టీపీల ఏర్పాటు ఎన్నడు.?
గోదావరి జలాల కాలుష్య నివారణ పథకం మూలకు పడడంతో ఇప్పుడు సీవెర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్ల ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ భద్రాచలం గోదావరి కరకట్టల కింద మూడు చోట్ల ఎస్టీపీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని సిటీలలో ఈ విధానం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు భద్రాచలంలో మూడు ఎస్టీపీలు కరకట్ట కింద ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. గోదావరి జలాలు కలుషితం కాకుండా సీవెర్​ ట్రీట్​మెంట్​ 
ప్లాంట్ల ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని మురికి నీరంతా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు. వరదల సమయంలో స్లూయిజ్​లు మూసివేయడంతో డ్రైన్​ వాటరంతా పట్టణాన్ని ముంచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ముప్పు తప్పదని స్థానికులు అంటున్నారు. ఫ్లడ్ లెవల్స్ ప్రకారం స్లూయిజ్​ల ఎత్తు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 

పథకం మూలకు.. మురుగునీరు గోదావరికి
గోదావరి జలాల కాలుష్య నివారణ పథకాన్ని 2004లో ప్రారంభించారు. గోదావరి కరకట్టలు నిర్మించాక పట్టణంలోని డ్రైన్​వాటర్​ను గోదావరిలో నేరుగా కలుస్తుండడంతో 1995–-96లో గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, రాజమండ్రిలలో రూ.34.19 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశారు. భద్రాచలంలో రూ.3.10 కోట్లతో ఎస్టీపీని నిర్మించారు. కానీ 2004లో ప్రారంభించిన ఈ స్కీమ్​ ఒక్క ఏడాది మాత్రమే పని చేసి మూలకు పడింది. మోటార్ల కెపాసిటీ సరిగా లేకపోవడం, డ్రైన్​వాటర్​ను మనుబోతుల చెరువు వద్దకు తరలించే పరిస్థితి లేకపోవడంతో ఈ స్కీం మూలకుపడింది. రూ.6 లక్షల మేర విద్యుత్​ బకాయిలు పేరుకుపోవడం కూడా ఒక కారణం. పికప్​గ్రిట్​​చాంబర్​ డైవర్షన్​ ఏర్పాటు చేసి సంప్​ కమ్​ పంపు హౌస్​ ద్వారా మురుగునీటిని మోటార్ల ద్వారా తోడి మనుబోతుల చెరువుకు తీసుకెళ్లి అక్కడ శుద్ది చేసి జలాలను వ్యవసాయానికి, మిగిలిన వ్యర్థాలను ఎరువులుగా మార్చడం ఈ స్కీం ఉద్దేశం. ఇందుకు 50హెచ్​పీ మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లు బిగించడంతో ఆగిపోయింది. ద్రవరూపంలో 70 మిలియన్ లీటర్లు, ఘనపదార్ధాల రూపంలో 25 టన్నుల కాలుష్యం నిత్యం భద్రాచలం స్నానఘట్టాల వద్ద గోదావరిలో కలుస్తోంది. నేషనల్​ గ్రీన్​ట్రిబ్యునల్ నిబంధనకు ఇది విరుద్ధం. అయినప్పటికీ మురికినీటిని శుద్ధి చేయకుండా గోదావరిలో నేరుగా 
కలుపుతున్నారు. 

కాలుష్యాన్ని తగ్గించవచ్చు
సీవేర్​ ట్రీట్​మెంట్ ప్లాంట్ల ఏర్పాటుతో మురుగునీటిని శుద్ధి చేయడం సాధ్యమవుతుంది. అన్ని చోట్ల ఇలా హైపవర్​ మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. కరకట్టలు పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా గోదావరి కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. - రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్

సమస్యకు పరిష్కారం చూపాలి
భద్రాచలంలో డ్రైన్​ వాటర్​ సమస్య ఎక్కువగా ఉంది. వర్షం వస్తే కరకట్ట స్లూయిజ్​ల ద్వారా గోదావరిలో డ్రైనేజీ వాటర్​ కలిపేస్తున్నారు. వరదలు వస్తే స్లూయిజ్ లు మూయడంతో ఆ నీరంతా సుభాష్​నగర్, చప్టా దిగువ, అశోక్​నగర్​ కొత్తకాలనీ,అయ్యప్పకాలనీలను ముంచెత్తుతోంది. దుర్వాసన భరించలేక పోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.  - తిరుమలరావు, న్యాయవాది, సామాజిక కార్యకర్త