మీరు ఒక చోట రైలు పట్టాలపై ఉన్న ఒక ఫుట్‌బ్రిడ్జిపై నిలుచున్నారు. ఆ రైల్వే ట్రాక్ఒకవైపు చాలా ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉంది. పల్లంగా ఉన్నచోట ట్రాక్ పై ఐదుగురు వర్కర్లు పనిచేస్తున్నారు. ఇంతలో ఎత్తున్న వైపు నుంచి కొన్ని బరువులతో ఉన్న ఓ పెద్ద ట్రాలీ పట్టాల మీదుగా వస్తోంది. అదేసమయంలో బ్రిడ్జిపై మీ ముందు ఓ పొడవాటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కిందకు తోసేస్తే పట్టాలపై ట్రాలీకి అడ్డంగా పడి, ట్రాలీ ఆగిపోయే చాన్స్ఉంది. ఇలాంటి సిచువేషన్లో మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని తోసేసి ఐదుగురిని కాపాడతారా? ఆ వ్యక్తి ప్రాణాలు తీయడం అన్యాయమని ఊరుకుంటారా?
మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది మీ మొరాలిటీ(నైతికత)కి సంబంధించిన విషయం. అయితే, మీరు మామూలుగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో? తాగి ఉన్నప్పుడు కూడా దాదాపుగా అదే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు రీసెర్చర్లు! అంటే.. ‘తాగితే వాడు మనిషి కాదురా’ అనేదాంట్లో అంతగా నిజం లేదని, తాగినా, తాగకున్నా మనుషుల మొరాలిటీ అనేది మారదని వారు స్పష్టం చేస్తున్నారు. మద్యం మత్తు మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో ఉన్న నిజం ఎంత అన్నది తెలుసుకునేందుకు తాము కొంత మంది వాలంటీర్లపై రీసెర్చ్చేశామని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ ఫోర్డ్‌కు చెందిన సైకాలజీ లెక్చరర్ క్యాథరిన్ ఫ్రాన్సిస్ వెల్లడించారు.
తాగినా తప్పొప్పులు తెలుస్తాయ్
మందు తాగినప్పుడు కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగేది నిజమే అయినా, నైతిక ప్రవర్తనలో మార్పు అనేది పెద్దగా ఉండదని డాక్టర్ క్యాథరిన్ చెబుతున్నారు. కలిసి మందు కొట్టినప్పుడు ఎదుటివారి పట్ల మంచి ఫీలింగ్ కలుగుతుందని, కొన్ని సార్లు మందు ఎక్కువైనప్పుడు విషయాలను సరిగ్గా కన్వే చేయలేక, మాటలు వ్యక్తపర్చడంలో తేడా వచ్చి గొడవలకు దారి తీస్తుందని ఆమె అంటున్నారు. కానీ మద్యం తాగినప్పుడు ఇతరుల పట్ల ఎమోషన్స్, రియాక్షన్స్ మారవచ్చు కాని, నీతి మారదని తమ పరిశోధనలో తేలిందని ఆమె స్పష్టం చేశారు. ఎంత మందు తాగినా, ఏది తప్పో? ఏది ఒప్పో వారికి తెలియకుండా పోదని తేల్చేశారు.
వోడ్కాతో ప్రయోగం
రీసెర్చ్‌లో భాగంగా క్యాథరిన్ టీమ్ కొంత మంది వలంటీర్లకు వోడ్కాను పలు దఫాలుగా, పలు మోతాదుల్లో ఇచ్చి ప్రతిసారి కొన్ని టాస్క్‌లు ఇచ్చి పరీక్షించారు. కొంతమంది ఆనందంగా, విషాదంగా, రకరకాల ఎమోషన్స్‌తో దిగిన ఫొటోలను చూపించినప్పుడు వలంటీర్ల రియాక్షన్స్, ఫీలింగ్స్, మోరల్ డెషిషన్స్ను పరిశీలించారు. తక్కువ వోడ్కా తాగినప్పుడు వలంటీర్లు బాగా స్పందించారు. ఎక్కువైనప్పుడు సరిగ్గా స్పందించలేరని తేలింది. ఆ ఫొటోల్లోని వ్యక్తుల ఎమోషన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారని అర్థమైంది. అలాగే, రైల్వే ట్రాకుపై ట్రాలీ వర్కర్లను కాపాడటం వంటి పలు సమస్యలనూ పరీక్షించారు. తాగినా, తాగకపోయినా అవే నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడైంది. సైకాలజీ పరంగా ఈ రీసెర్చ్ఫలితాలను తాము పూర్తిగా విశ్లేషించామని, ఆల్కహాల్మన వ్యక్తిత్వాలను మారుస్తుందన్నది నిజం కాదని తేలిందని డాక్టర్ క్యాథరీన్ వెల్లడించారు. మందు ఎక్కువైతే మన భావాలను, ఎమోషన్స్‌ను చూపించే తీరులోనే తేడా వస్తుందని, మొరాలిటీలో మార్పు ఉండదని తెలిపారు. అందువల్ల అనైతిక ప్రవర్తనలకు ఆల్కహాల్‌ను బ్లేమ్ చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
