2 మామిడిపండ్లు దొంగిలించాడని… దుబాయ్‌లో భారతీయుడి అరెస్ట్

2 మామిడిపండ్లు దొంగిలించాడని… దుబాయ్‌లో భారతీయుడి అరెస్ట్

దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేసే భారతీయ ఉద్యోగిని.. 2 మామిడి కాయలు దొంగిలించాడన్న అభియోగంపై అరెస్ట్ చేశారు. యూఏఈ కరెన్సీ 6 దిరమ్స్ విలువైన మామిడి కాయలు దొంగతనం చేశాడంటూ అతడిపై ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాధారాలు దొరకడంతో.. ఆయన్ను లేటెస్ట్ గా అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. సెప్టెంబర్ 23న అక్కడి కోర్టులో తీర్పు రానుంది.

27 ఏళ్ల భారతీయ వ్యక్తి… దుబాయ్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 3లో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇండియాకు వస్తున్న ఓ ప్యాసింజర్ కు సంబంధించిన లగేజ్ ను.. కన్వేయర్ బెల్టుపైకి ఎక్కిస్తున్న టైమ్ లో.. ఓ బ్యాగ్ లో దొరికిన మామిడి పళ్లలో రెండింటిని తీసుకున్నాడు. ఈ సంఘటన 2017లో నమోదైంది. సీసీ ఫుటేజ్ చెక్ చేసిన ఎయిర్ పోర్టు సిబ్బంది… అతడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఆ సమయంలో ఆకలిగా అనిపించిందని.. అందుకే.. 2 మామిడి పండ్లు తీసుకుని తిన్నానని భారతీయ ఉద్యోగి అధికారులకు వివరణ ఇచ్చారు. ఈ కేసు అక్కడి కోర్టులో త్వరలోనే హియరింగ్ కు రాబోతోంది.

దుబాయ్ ఎయిర్ పోర్టులో ప్యాసింజర్లకు, వారి లగేజ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. దొంగతనంగా తీసుకున్న వస్తువేదైనా సరే.. అనుమతి లేకుండా బ్యాగ్ ఓపెన్ చేయడం.. అందులోనివి తీసుకోవడాన్ని నేరంగానే పరిగణిస్తామని దుబాయ్ ఎయిర్ పోర్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరం నిరూపితమైతే.. కోర్టు అతడికి ఫైన్ వేయొచ్చు. లేదా.. కొన్ని రోజుల జైలు శిక్ష విధించొచ్చు.