రెండు మామిడి పండ్లను దొంగలించినందుకు ఓ ఉద్యోగికి మూడు నెలల జైలు శిక్షతో పాటు, దేశ బహిష్కరణ వేటు పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లగేజ్ వర్కర్ గా పని చేసే భారత్ కు చెందిన వ్యక్తి ఓ ప్రయాణికుడి లగేజీ నుండి రెండు మామిడి పండ్లను దొంగతనం చేశాడు. తన విధుల్లో భాగంగా ప్రయాణికుల సామానును కంటైనర్ నుండి కన్వేయర్ బెల్ట్‌లోకి ఎక్కించే క్రమంలో అతను ఈ పని చేశాడు.
ఆగస్టు 11, 2017 న తన విధుల్లో ఉండగా ..ఈ పని చేసినందుకు గాను కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ అతనికి 5 వేల డాలర్ల జరిమానాతో పాటు, దేశం నుంచి వెళ్లిపోవాలని సోమవారం ఆదేశించింది. అతను తన తప్పును ఒప్పుకుంటూ ఆ సమయంలో చాలా ఆకలిగా, దాహంగా ఉన్నానని , అందుకే వాటిని దొంగిలించానని కోర్టుకు తెలిపాడు
ఈ సంఘటన గురించి 2018 ఏప్రిల్‌లోనే పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. అతన్ని అరెస్టు చేసి, అతని స్థలాన్ని శోధించారు. కానీ అక్కడ సరైన ఆధారాలేవి దొరకలేదు. తాజాగా అక్కడి సిసిటివి కెమెరాలో ప్రయాణికుల సామాను తెరిచి దొంగిలించడాన్ని తాను చూశానని భద్రతా అధికారి తెలుపడంతో అతను దొంగతనం విషయం రుజువైంది. ఆ కార్మికుడికి ఈ తీర్పు పై 15 రోజుల్లోపు అప్పీల్ చేసే హక్కు ఉంది.

