లోన్ల దుర్వినియోగంపై విచారణ.. సంఘాల లావాదేవీలపై ఆడిట్ చేయాలని ఆదేశాలు

లోన్ల దుర్వినియోగంపై విచారణ.. సంఘాల లావాదేవీలపై ఆడిట్ చేయాలని ఆదేశాలు

యాదాద్రి, వెలుగు : మహిళా సంఘాలు తీసుకున్న లోన్ల దుర్వినియోగంపై విచారణ మొదలైంది. ఇందులో భాగంగా భువనగిరి టౌన్​కు సంబంధించిన  సంఘాల పరిస్థితిపై  యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఎ భాస్కరరావు సోమవారం మీటింగ్​ నిర్వహించారు.

టౌన్​లోని 1200 సంఘాలు తీసుకున్న లోన్లపై ఆరా తీశారు. ఈ మీటింగ్​కు 46 మంది రిసోర్స్​ పర్సన్లు హాజరుకాగా .. లోన్ల దుర్వినియోగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆర్​పీలు రాలేదు.  వీరిలో ఒకరిపై ఇప్పటికే  భువనగిరి టౌన్​లో కేసు నమోదు అయిందని  ఆఫీసర్లు చెప్పారు.

మరో ఇద్దరు పర్యవేక్షిస్తున్న సంఘాల లోన్ల లావాదేవీలు పరిశీలించి, దుర్వినియోగం అయినట్టుగా తేలితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్​ కలెక్టర్​   సూచించారు. పట్టణంలోని 1200 సంఘాలకు సంబంధించిన లావాదేవీలపై ఆడిట్​ నిర్వహించాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. అదే విధంగా ఆరుగురు మెంబర్లతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మీటింగ్​లో ఎల్​డీఎం శివరామకృష్ణ, మెప్మా ఆఫీసర్​ రమేశ్​ బాబు, డీపీఎం ప్రభాకర్​, కెనెరా బ్యాంక్​ మేనేజర్​ మెతిన్​ రాజ్​ ఉన్నారు.