ఆన్​లైన్​లో  ఈజీగా ఆధార్ అడ్రస్ మార్పు

ఆన్​లైన్​లో  ఈజీగా ఆధార్ అడ్రస్ మార్పు

న్యూఢిల్లీ : తమ కుటుంబ పెద్దల సమ్మతితో ఆన్‌‌లైన్‌‌లో ఆధార్‌‌లోని చిరునామాలను ఎవరైనా అప్‌‌డేట్ చేసుకోవడానికి యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (యుఐడిఎఐ) అనుమతించింది.   రేషన్ కార్డ్, మార్క్ షీట్, పెళ్లి ధృవీకరణ పత్రం, పాస్‌‌పోర్ట్ మొదలైన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, దరఖాస్తుదారుడు తమ  కుటుంబ పెద్ద, ఇద్దరి పేర్లు,  వారి మధ్య సంబంధాన్ని పేర్కొన్న తర్వాత అడ్రస్​ మార్పు పనిని ప్రారంభించవచ్చు. ఇందుకు కుటుంబ పెద్ద ద్వారా ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్​ అవసరం. రిలేషషన్​షిప్​ రుజువు అందుబాటులో లేకుంటే, యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌‌లో కుటుంబ పెద్ద ద్వారా సెల్ఫ్​-డిక్లరేషన్‌‌ను సమర్పించవచ్చు. తమ పేరు మీద సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మొదలైనవారికి ఈ కొత్త విధానం ఎంతో అనువుగా ఉంటుంది.

వివిధ కారణాల వల్ల చాలా మంది  నగరాలకు,  పట్టణాలకు తరలి వెళ్తున్నందున ఇటువంటి సౌకర్యం లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది. గతంలో మాదిరే యూఐడీఏఐ నిర్దేశించిన అడ్రస్​ ప్రూఫ్​ ఉపయోగించి చిరునామాను మార్చే విధానం కూడా కొనసాగుతుంది. కొత్త పద్ధతిలో18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా  ఈ ప్రయోజనం కోసం కుటుంబ పెద్దగా మారవచ్చు. సంబంధీకులకు చిరునామాను అందజేయవచ్చు. దరఖాస్తులు ఆన్‌‌లైన్​లో చిరునామాలను అప్‌‌డేట్ చేయడానికి 'మై ఆధార్' పోర్టల్‌‌ని సందర్శించాలి. కుటుంబ పెద్ద  ఆధార్ నంబర్‌‌ను నమోదు చేయాలి.  వెరిఫికేషన్​ తర్వాత, నివాసి రిలేషన్ షిప్ రుజువును అప్‌‌లోడ్ చేయాలి. చిరునామాను మార్చుకోవడానికి చార్జీగా రూ. 50  చెల్లించాలి. డబ్బు డెబిట్​ అయిన తరువాత సర్వీస్​ రిక్వెస్ట్​ నంబర్ (ఎస్​ఆర్​ఎన్​) వస్తుంది. చిరునామా మార్పు రిక్వెస్ట్ గురించి కుటుంబ పెద్దకి ఎస్​ఎంఎస్​ కూడా వెళ్తుంది. ఇప్పుడు కుటుంబ పెద్ద అభ్యర్థనను ఆమోదించాలి.  నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి 30 రోజులలోపు మై ఆధార్​ పోర్టల్‌‌కి లాగిన్ అయి అంగీకారం తెలిపాలి. తదనంతరం రిక్వెస్ట్​ను ఆమోదిస్తారు. కుటుంబ పెద్ద  చిరునామాను పంచుకోవడానికి తిరస్కరిస్తే లేదా ఎస్​ఆర్​ఎన్​ను అంగీకరించకపోయినా పని జరగదు.