‘సర్’ గడువు మళ్లీ పొడిగించారు.. ఆగస్టు 10 లాస్ట్ డేట్.. సవరించిన షెడ్యూల్ ఇదే

‘సర్’ గడువు మళ్లీ పొడిగించారు.. ఆగస్టు 10 లాస్ట్ డేట్.. సవరించిన షెడ్యూల్ ఇదే
  • 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​(సర్) గడువును  మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 10వ తేదీ వరకు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని స్పష్టం చేశారు. అప్పటివరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు తిరిగి ఇవ్వొచ్చని తెలిపారు.

తొలుత ఈ గడువు జులై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు. సవరించిన నిబంధనల ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా 17న విడుదల కానుంది. అలాగే, జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌‌‌‌ల స్వీకరణ ప్రక్రియ ముసాయిదా వచ్చిన తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ తర్వాత నెల రోజులు క్లయిమ్స్, అభ్యంతరాల పరిష్కరించనున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్‌‌‌‌ పూర్తయిందని సీఈఓ తెలిపారు.  హైదరాబాద్‌‌‌‌ జిల్లాలో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43, మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం పూర్తయినట్లు పేర్కొంది. ఈ మూడు ప్రధాన జిల్లాల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలో ఫారాలు అందాల్సి ఉండడమే గడువు పొడిగింపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

 సవరించిన ‘సర్’ షెడ్యూల్

ఎన్యూమరేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 10
ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ: ఆగస్టు 17
క్లెయిమ్‌‌‌‌లు, అభ్యంతరాల స్వీకరణ: 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్​ వరకు
క్లెయిమ్‌‌‌‌లు, అభ్యంతరాల పరిష్కారం (నోటీసు కాలం): 15 అక్టోబర్​ వరకు
తుది ఓటరు జాబితాల ప్రచురణ: అక్టోబర్​ 19