డీసీపీ రాధాకిషన్ రావుపై ఈసీ వేటు.. కేసీఆర్‌‌‌‌కు అనుకూలమైన అధికారిగా ముద్ర

డీసీపీ రాధాకిషన్ రావుపై ఈసీ వేటు.. కేసీఆర్‌‌‌‌కు అనుకూలమైన అధికారిగా ముద్ర

హైదరాబాద్‌‌, వెలుగు: టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రాధాకిషన్ రావుపై వేటు పడింది. పదవీవిరమణ పొందిన తరువాత కూడా నాలుగేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తుండడంపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈసీ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకిషన్‌‌ రావుపై చర్యలు తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించింది. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా తప్పిస్తూ నితికా పంత్‌‌ ఐపీఎస్‌‌(2017)కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

కేసీఆర్ ​ఫ్యామిలీకి క్లోజ్​

టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు నాలుగేండ్ల కింద పదవీవిరమణ పొందారు. వెంటనే ఆయన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌‌డీ) కింద అదే పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో నాలుగేండ్లుగా రాధాకిషన్ రావు సిటీ టాస్క్‌‌ఫోర్స్ డీసీపీగా కొనసాగుతున్నారు. కీలకమైన కేసులను పర్యవేక్షించారు. అయితే సీఎం కేసీఆర్ కుటుంబం, బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

నలుగురు ఐపీఎస్​ల బదిలీ

నలుగురు ఐపీఎస్​లను కూడా ట్రాన్స్ ఫర్ చేయాలని ఈసీ ఆదేశించింది. బిరుదరాజు రోహిత్ రాజును హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. సౌత్ వెస్ట్ జోన్​కు డీసీపీగా బాలాస్వామిని, టాస్క్​ఫోర్స్ డీసీపీగా నితికా పంత్, చేతన మైలాబాతులను రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి డీసీపీగా, తరుణ్ జోషిని రాచకొండ జాయింట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌‌ అధికారులకు పోస్టింగ్‌‌లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, రంగనాథ్‌‌ను టీఎస్‌‌పీఏ జాయింట్‌‌ డైరెక్టర్‌‌గా నియమించింది. టీఎస్‌‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌‌గా రాజేంద్ర ప్రసాద్, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్‌‌ ఎస్పీగా వెంకటేశ్వర్లును నియమించింది.

107 మందిపై ఈసీ అనర్హత వేటు

రాష్ట్రానికి చెందిన 107 మంది రాబోయే అసెంబ్లీ, లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సదరు అభ్యర్థులు.. వారి ఖర్చులకు సంబంధించిన వివరాలను సమర్పించనందుకు వారిపై వేటు పడింది. ఒక్క నిజామాబాద్ లోక్‌‌సభ నియోజకవర్గం నుంచే ఈ తరహా అభ్యర్థులు ఏకంగా 68 మంది ఉన్నారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా  పసుపు రైతులు పెద్ద ఎత్తున పోటీలోకి దిగిన విషయం తెలిసిందే. వారంతా ఖర్చుల లెక్కలను సమర్పించలేదు. దీంతో వారందరినీ ఎలక్షన్లలో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నది.