- క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డులు ప్రవేశపెట్టిన ఈసీ
న్యూఢిల్లీ: ఈ నెల 4 న జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లే వారికి క్యూఆర్ కోడ్ కలిగిన ఫొటో గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (మే 4) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు స్థాయిల్లో భద్రతా తనిఖీలు ఉంటాయి. మొదటి రెండు దశల్లో రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన పొటో గుర్తింపు కార్డులను సిబ్బంది మాన్యువల్‌గా తనిఖీ చేస్తారు.
అత్యంత కీలకమైన మూడో దశలో కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్లే చివరి గేటు వద్ద, ఐడీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే అనుమతి ఇస్తారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సాంకేతిక సిబ్బందికి ఈ క్యూఆర్ కోడ్ కార్డులు జారీ చేస్తారు.
