- ఆంధ్రాబ్యాంకు సౌభాగ్య ఇస్పాట్ సంస్థ రూ.46.52 కోట్ల టోకరా
- రూ.31 కోట్లు చెల్లించకుండా మోసం.. మనీలాండరింగ్ కేసులో ఆస్తులు జప్తు
హైదరాబాద్, వెలుగు: బ్యాంకు లోన్ తీసుకొని మోసం చేసిన కేసులో సౌభాగ్య ఇస్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ ఆధీనంలోకి తీసుకుంది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద కంపెనీకి చెందిన రూ.26.86 కోట్లు విలువచేసే స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించింది.
సౌభాగ్య ఇస్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌ఐఐపీఎల్) కంపెనీ డైరెక్టర్లు ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటు, విస్తరణ కోసం ఆంధ్రా బ్యాంక్(ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తీసుకున్నారు. రుణ పరిమితులను పెంచేలా నకిలీ స్టాక్ స్టేట్‌మెంట్లు, ఫేక్ ఆడిట్ రిపోర్టులు డిపాజిట్ చేశారు. బ్యాంకు నుంచి పొందిన రుణాలను ఇతర సంస్థల ద్వారా దారి మళ్లించారు. లోన్ తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సీబీకి ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో బెంగళూరు బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్స్ బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. నకిలీ లావాదేవీలు, సర్క్యులర్ ట్రాన్సాక్షన్ల ద్వారా కంపెనీ ఆర్థిక స్థితిని కృత్రిమంగా పెంచి చూపినట్లు గుర్తించింది. బ్యాంకును మొత్తం రూ. 46.52 కోట్ల మేర మోసగించినట్టు తేల్చి రూ.15.52 కోట్లు తిరిగి వసూలు చేసింది. ఇంకా రూ. 31 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా తాజాగా రూ.26.86 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. సంస్థకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఇల్లు, ఖాళీ స్థలాలు ఉన్నట్టు గుర్తించి పీఎంఎల్‌ఏ చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
