అమెరికన్లు టార్గెట్‌‌ గా అహ్మదాబాద్‌‌ లో కాల్‌‌ సెంటర్లు : ఈడీ

అమెరికన్లు టార్గెట్‌‌ గా అహ్మదాబాద్‌‌ లో కాల్‌‌ సెంటర్లు : ఈడీ
  • పెండింగ్‌‌ ట్యాక్స్‌‌, లోన్లు చెల్లించాలని బెదిరింపులు
  •     అమెజాన్ గిఫ్ట్‌‌ కార్డులు కొనిపించి బిట్‌‌ కాయిన్స్, క్రిప్టోగా మార్చి దందా
  •     సైబరాబాద్‌‌, ఢిల్లీలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు
  •     నాలుగు రోజులు సెర్చ్ ఆపరేషన్

హైదరాబాద్‌‌, వెలుగు: అమెరికన్  సిటిజన్లతో పాటు విదేశీయులను మోసం చేస్తున్న కాల్‌‌ సెంటర్‌‌  ముఠాలపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌  డైరెక్టరేట్‌‌ (ఈడీ) దాడులు నిర్వహించింది. సైబరాబాద్  కమిషనరేట్‌‌, సీబీఐ ఢిల్లీ యూనిట్‌‌లో నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ల ఆధారంగా ప్రివెన్షన్‌‌  ఆఫ్‌‌  మనీ లాండరింగ్‌‌  చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌‌లోని ఆరు ప్రాంతాల్లో గత వారం సోదాలు నిర్వహించింది. 4 రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో.. 12 వేల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ, రూ.13.5 లక్షల నగదు, డిజిటల్‌‌  పరికరాలు స్వాధీనం చేసుకుంది. 

నిందితులకు సంబంధించిన 31 బ్యాంకు ఖాతాలు, ఒక  లాకర్‌‌ను ఫ్రీజ్‌‌  చేసింది. నిందితుల పేర్లతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో కూడబెట్టిన ఆస్తులను సీజ్‌‌ చేసింది. ఈ మేరకు హైదరాబాద్  జోనల్‌‌  ఈడీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  

యూఎస్‌‌ అధికారులమంటూ బెదిరిస్తూ.. 

అహ్మదాబాద్‌‌కు చెందిన మహ్మద్‌‌  అన్సారీ అలియాస్‌‌  ఇర్ఫాన్‌‌  అన్సారీ, ఆకిబ్‌‌  గులామ్‌‌  రసూల్‌‌  ఘాంచి, వికాస్‌‌  నిమార్‌‌, దివ్యాంగ్‌‌  రవాల్‌‌, ప్రదీప్‌‌  రాథోడ్‌‌ తదితరులు తమ అనుచరులతో కలిసి అక్రమంగా కాల్‌‌ సెంటర్లను నడుపుతున్నారు. శిక్షణ పొందిన సిబ్బంది, కాల్‌‌ స్క్రిప్టులు, నగదు లావాదేవీలకు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాల్‌‌ సెంటర్‌‌  నిర్వాహకులు యూఎస్‌‌  ప్రభుత్వ విభాగాల అధికారులుగా, ప్రైవేట్‌‌  కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ మోసాలకు పాల్పడ్డారు. పెండింగ్‌‌ లోన్లు, ట్యాక్స్‌‌లు చెల్లించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఎస్‌‌  సిటిజన్లను బెదిరించారు. 

ఈ క్రమంలోనే వారి ద్వారా అమెజాన్‌‌  గిఫ్ట్‌‌ కార్డులు కొనుగోలు చేయించడం, డిజిటల్‌‌   చెల్లింపులు చేయించడం ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నట్లు గతంలో సైబరాబాద్‌‌, ఢిల్లీలో పలు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల ఆధారగా ఈడీ దర్యాప్తు చేసింది.