ఆప్ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్ లక్ష్యంగా ఈడీ చేపట్టిన ఆకస్మిక సోదాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైందా అన్నట్లుగా.. బుధవారం తెల్లవారుజాము నుంచే జలంధర్, చండీగఢ్ ఈడీ టీమ్స్ ఫగ్వారాలోని యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు లవ్లీ గ్రూప్‌కు చెందిన పలు వ్యాపార సంస్థలపై విరుచుకుపడ్డాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈడీ సోదాలు కేవలం యూనివర్సిటీకే పరిమితం కాకుండా.. లవ్లీ గ్రూప్‌కు చెందిన స్వీట్ షాపులు, ఆటోమొబైల్ షోరూమ్‌లు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లతో పాటుగా అశోక్ మిట్టల్ ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ ఆపరేషన్ తీవ్రతను తెలియజేస్తోంది. స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా సెంట్రల్ ఏజెన్సీలు అత్యంత రహస్యంగా ఈ దాడులను కొనసాగించడం గమనార్హం. రాజ్యసభలో ఆప్ డెప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈడీ రైడ్స్ జరుగుతుండటం వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ దాడులను "మోదీ స్టైల్ రాజకీయం"గా అభివర్ణించగా.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేరుగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే బీజేపీ ఈడీని ప్రయోగిస్తోందని.. పంజాబ్ ప్రజలు ఈ అణచివేత చర్యలకు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. పార్టీలో కీలక పదవి దక్కిన ఆనందం మిట్టల్ వర్గంలో నెలకొన్న తరుణంలో.. ఈ సోదాలు వారిని ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తున్నాయి.
లవ్లీ గ్రూప్ అనేది పంజాబ్‌లో పెద్ద వ్యాపార సామ్రాజ్యం అని తెలిసిందే. అశోక్ మిట్టల్ తన సోదరులు రమేష్, నరేష్ మిట్టల్‌లతో కలిసి దీనిని విస్తరించారు. ఒక సాధారణ వ్యాపార సంస్థ నుంచి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎదిగిన LPU పై ఇప్పుడు ఈడీ చూపు పడటం ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ రంగాల్లో చర్చనీయాంశమైంది. అశోక్ మిట్టల్ పదవీ బాధ్యతలను సాధారణ ప్రక్రియగా అభివర్ణించినా.. కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీతో పంజాబ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందనే చెప్పుకోవాలి. మరి ఈ సోదాల్లో ఏవైనా కీలక డాక్యుమెంట్లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దొరికాయా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

