రెండో విడత విదేశీ స్టడీ టూర్కు 190 మంది.. వచ్చే నెల 7లోగా ఎంపిక చేయాలని కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశం

రెండో విడత విదేశీ స్టడీ టూర్కు 190 మంది.. వచ్చే నెల 7లోగా ఎంపిక చేయాలని కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశం
  • సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జపాన్, సింగపూర్, వియత్నాం, చైనా తదితర దేశాల్లో పర్యటన
  • వచ్చే నెల 7లోగా ఎంపిక చేయాలని కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలకు విదేశాల్లో విద్యా విధానాల అధ్యయనానికి మరోసారి అవకాశం కల్పించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. టీచర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రెండో విడతలో 190 మందిని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జపాన్‌‌‌‌‌‌‌‌, సింగపూర్‌‌‌‌‌‌‌‌, వియత్నాం, చైనా, ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌లకు పంపనుంది.

ఈ మేరకు ఎంపిక ప్రక్రియను ఆగస్టు 7లోగా పూర్తి చేసి జాబితా పంపాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొత్తం 500 మందిని విదేశాలకు పంపే ప్రణాళికలో భాగంగా తొలి విడతలో 28 మంది ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌ పర్యటించగా, మరో 69 మంది త్వరలో వెళ్లనున్నారు. ఎంపికయ్యే అభ్యర్థులు 55 ఏళ్లలోపు ఉండి, కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

వారు పనిచేస్తున్న పాఠశాలలో కనీసం 100 మంది విద్యార్థులు ఉండటంతో పాటు, గత మూడేళ్లలో విద్యార్థుల విద్యా ఫలితాలు, అడ్మిషన్లు మెరుగుపరిచిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విదేశాల్లో కమ్యూనికేషన్ కోసం ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌పై పట్టు తప్పనిసరి. ఎంపికైన వారిపై ఎలాంటి క్రమశిక్షణా విచారణలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొత్తం 190 మందిలో 114 మంది మహిళా టీచర్లు, 76 మంది పురుష టీచర్లకు అవకాశం కల్పించారు. వీరిలో 64 మంది హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలు, 63 మంది స్కూల్ అసిస్టెంట్లు, 63 మంది ఎస్‌‌‌‌‌‌‌‌జీటీలు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నిబంధనల ప్రకారం ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.